నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టే కరెక్ట్.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టే కరెక్ట్.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు :  నకిలీ విత్తనాలను అమ్మిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. రైతుల ప్రయోజనాల కోసం నకిలీ విత్తనాలను అమ్మేవాళ్లను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం సబబేనని చెప్పింది. ఈ మేరకు రాచకొండ సీపీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు వీలుగా రాచకొండ సీపీ జులై 15న ఉత్తర్వులను, అందుకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 1048ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌‌‌‌ లక్ష్మణ్, జస్టిస్‌‌‌‌ కె.సుజనలతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ తీర్పు చెప్పింది. 

22 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను అమ్ముతున్నారంటూ నార్కట్‌‌‌‌పల్లి, చౌటుప్పల్‌‌‌‌ పీఎస్‌‌‌‌ల్లో కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్‌‌‌‌ వచ్చిన వెంటనే మళ్లీ అదే నేరానికి పాల్పడటంతో పీడీ యాక్ట్‌‌‌‌ ప్రయోగిస్తూ రాచకొండ కమిషనర్‌‌‌‌ నిర్ణయం తీసుకోవడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ కేసులో నాగపూర్‌‌‌‌కు చెందిన గడ్డం రవీంద్రబాబును పీడీ యాక్ట్‌‌‌‌ కింద పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను సవాల్ చేస్తూ ఆయన సోదరుడు గడ్డం తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ వేయగా.. డివిజన్ బెంచ్ దాన్ని కొట్టేసింది.