
హైదరాబాద్,వెలుగు: సినీ ఇండస్ట్రీకి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రాజీవ్ త్రివేది చురకలు అంటించారు. మాతృమూర్తులైన మహిళలను సినిమాల్లో అసభ్యంగా చూపిస్తూ దేశ సంస్కృతిని దెబ్బతీస్తున్నారని అన్నారు. మార్చి17న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా .. హైదరాబాద్ షీ టీమ్స్ నిర్వహించనున్న వీ ఆర్ వన్ (V r 1) లో గోను ఆయన ఆవిష్కరించారు.
సైఫాబాద్ ఫ్యాప్సీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో హీరో నిఖిల్ సిద్ధార్ధ్ తో రాజీవ్ త్రివేది ఈ కామెంట్స్ చేశారు. మహిళలను గౌరవించడం సాంప్రదాయంగా వస్తున్న మన దేశంలో అసభ్యకర సన్నివేశాలు యువతలో విషం నింపుతున్నాయని అన్నారు. దీని వల్ల యువత పెడదారి పట్టే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పురాణాల్లో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యతను గురించి త్రివేది వివరించారు.
“దేశంలో మహిళా భధ్రతకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. రాష్ట్రంలో షీ టీమ్స్ ఎంతో సమర్ధవంతగా పనిచేస్తున్నాయి. సిటీని సేఫ్ అండ్ సెక్యూర్ నగరంగా తీర్చిదిద్దడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. ప్రపంచంలోని ఏ దేశ మహిళలైనా హైదరాబాద్ లో నిర్భయంగా జీవించేలా పోలీస్ డిపార్ట్ మెంట్ భరోసా కల్పించింది. ఏటా మహిళా దినోత్సవం రోజు నిర్వహించే యుూనిటీ రన్ విమెన్ సేఫ్టీ గురించి ప్రపంచానికి చాటి చెబుతోంది” అని రాజీవ్ త్రివేది అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్ ను రాజీవ్ త్రివేది అభినందించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “వీ ఆర్ వన్” రన్ లో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాజీవ్ త్రివేది సూచించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన హీరో నిఖిల్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్ 2కే, 5కే,10కే రన్ పోస్టర్లను విడుదల చేశారు. నిఖిల్ మాట్లాడుతూ…ప్రస్తుత సమాజంలో బాలికలు,మహిళలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో మహిళ రక్షణ కోసం షీ టీమ్స్ కీ రోల్ పోషిస్తున్నాయని అన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు భరోసా కల్పిస్తున్న షీ టీమ్స్ పోలీసులు హైదరాబాద్ హీరోలుగా అభివర్ణించారు. రాత్రి10గంటల సమయంలో అయినా సరే అమ్మాయిలు ఒంటరిగా సిటీలో తిరిగే భరోసా కల్పించారని అన్నారు. దీనికి కారణం షీ టీమ్స్, రాష్ట్ర పోలీసుల సెక్యూరిటినే అన్నారు.
సమాజంలో మహిళలను గౌరవించేలా షీ టీమ్స్ చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని నైనా జైశ్వాల్ అన్నారు. మహిళా భధ్రతకు పెద్దపీట వేస్తున్న షీ టీమ్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆడమగ తేడా లేకుండా వీ ఆర్ వన్ పేరుతో నిర్వహించే రన్ లో యువత భారీ సంఖ్యలో పాల్పొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పనతో సాగుతున్న షీ టీమ్స్ దేశంలో మంచి పేరు తెచ్చుకున్నాయని జైశ్వాల్ అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలు ఓ ఐశ్వర్య రాయ్ కావాలంటే అదృష్టం కావాలి కానీ మదర్ థెరిస్సా కావాలంటే మంచి మనస్సు ఉండాలని చెప్పారు నైనా జైశ్వాల్. మార్చి17న నిర్వహించే రన్ లో యువతీ,యువకులు పాల్గొని మహిళా భధ్రతపై దేశానికి సందేశం ఇవ్వాలని అన్నారు.
షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీ ఆర్ వన్ రన్ తో సిటీలో మహిళల రక్షణపై మరోసారి సెక్యూరిటీ సంకేతాలు అందుతాయని సీపీ అంజనీకుమార్ అన్నారు. హైదరాబాద్ సిటీకి ఇప్పటికే దేశంలోనే సేఫెస్ట్ సిటీగా మంచి పేరుందని అన్నారు. వరల్డ్ విమెన్ డే సందర్భంగా మార్చి17న నిర్వహించే 2కే, 5కే,10కే రన్ లో యువత పాల్గొనాలని సీపీ కోరారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రన్ లో పాల్గొనాలనుకునే వారు www.ifinish.in ద్వారా లేదా భరోసా సెంటర్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. 17 వ తేదిన ఉదయం 6.30 గంటలకు 10 కే, 6.45గంటలకు 5కే, 7గంటలకు 2కే రన్ ఉంటుందని చెప్పారు. అదనపు సీపీ క్రైమ్స్ షికాగోయల్ ఆధ్వర్యంలో ముగ్గురు డీసీపీలతో ఇద్దరు అదనపు డీసీపీలతో కలిపి ఆర్గనైజింగ్ కమిటీ పనిచేస్తోందని సీపీ అంజనీకుమార్ తెలిపారు.