మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామానికి చెందిన శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో రంగస్థల కళా ప్రదర్శనల పోటీలు నిర్వహించనున్నట్లు ఆ కళాపరిషత్ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు గడ్డం సుబ్బారావు, పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్ తెలిపారు. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక, పద్య, దృశ్య, ఏకాంకిక విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.
శుక్రవారం మధిర మండల పరిధిలోని మాటూరుపేట గ్రామంలో రామాలయంలో పోటీల నిర్వహణకు సంబంధించిన పాంప్లేట్స్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలలకు పుట్టినిల్లుగా ఉన్న మధిర ప్రాంతంలో కళాకారులను ప్రోత్సహిస్తూ భావితరాలకు రంగస్థలం నాటకాలను పరిచయం చేసేందుకు మాటూరుపేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే జనవరి 29, 30 , 31 తేదీల్లో మధిర బంజారాకాలనీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో పాల్గొన్న విజేతలకు సీన్లు విభాగంలో ప్రథమ బహుమతిరూ. 10,016, ద్వితీయ రూ.8,016, తృతీయ రూ.6,016, కన్సోలేషన్ బహుమతిగా రూ. 2000 చొప్పున అందించనున్నట్లు తెలిపారు.
ఏకపాత్రలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు రూ.5016, రూ.3016, రూ.2016తో పాటు మరో ఎనిమిది మందికి కన్సిలేషన్ బహుమతులు అందించనున్నట్లు వివరించారు. ఎంట్రీలను జనవరి 24 లోపు 9440313937 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రామాలయం దేవస్థానం చైర్మన్ రాయల కోటయ్య, గ్రామ పెద్దలు , కళాకారులు పాల్గొన్నారు.
