ఎస్ఎన్డీపీ కోసం రూ.985 కోట్లు కేటాయించినం

ఎస్ఎన్డీపీ కోసం రూ.985 కోట్లు కేటాయించినం

హైదరాబాద్: ఎస్ఎన్డీపీ కార్యక్రమంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలే చెప్పారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క ఏరియాలో జరిగిన పనులను పూర్తి పథకానికి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. శనివారం ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో వరదల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎన్డీపీ కార్యక్రమాన్ని చేపట్టిందని అందుకోసం రూ.985 కోట్లు కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.103 కోట్లను వర్కింగ్ ఏజెన్సీలకు చెల్లించామని, ఇంకా రూ.150 కోట్ల బిల్లు చెల్లింపు ప్రక్రియలో ఉందని వెల్లడించారు. దీంతో పాటు రూ.200 కోట్ల పనులు తుది దశలో ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ రకంగా ఇప్పటికే రూ.450 కోట్ల పనులతో జీహెచ్ఎంసీ అభివృద్ధిలో దూసుకుపోతుంటే... ఎస్ఎన్డీపీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మాత్రమే విడుదల చేసిందంటూ ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గమైన సికింద్రాబాద్ లో జరిగిన అభివృద్ధి పనులపై కూడా కనీస అవగాహన లేదని విమర్శించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమానికి ఎలాంటి నిధుల కొరతలేదని, బిల్లుల చెల్లింపు కూడా వేగంగా జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసత్యాలు చెప్పడం మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. 

నగరంలోని పలు ప్రాంతాల్లో తగ్గిన వరద ముప్పు

ఎస్ఎన్డీపీ పనుల వల్ల జీహెచ్ఎంసీకి భారీగా వరద ముప్పు తప్పిందని స్పష్టం కేటీఆర్ తెలిపారు. బండ్లగూడ, నాగోల్, హయత్ నగర్, సింగరేణి కాలనీ, రామంతపూర్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల, మదీనగూడ, నిజాంపేట్, బంజారా కాలనీ, సరస్వతీ నగర్ మన్సురాబాద్, వనస్థలిపురం లోని క్రిస్టియన్ కాలనీ, కోదండ రామ్ నగర్, పీ అండ్ టీ కాలనీ, తపోవన్ కాలనీ, స్వర్ణాంధ్ర కాలనీ యాప్రాల్, హబీబ్ నగర్, ఇక్రిసాట్ కాలనీ, హఫీజ్ బాబా నగర్, ముర్కి నాల వంటి ప్రాంతాల్లో గతంలో బాగా వరదలు వచ్చేవని, కానీ ఎస్ఎన్డీపీ పనులు, కాలువల పునరుద్ధరణ వల్ల వరద ముప్పును గణనీయంగా తగ్గించామని కేటీఆర్ చెప్పారు.