- కేసీఆర్ గొప్పులు చెప్పుకోవడం సరికాదు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నా రెడ్డి
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు కట్టింది తామే అంటూ మాజీ సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం సరికాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నా రెడ్డి అన్నారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టారని, మిగతా ప్రాజెక్టులు కట్టింది, కట్టబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఆ లక్ష కోట్లు వేరే ప్రాజెక్టులపై వెచ్చిస్తే తెలంగాణ నీటి వనరులతో సస్యశ్యామలంగా మారేదన్నారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్ను లక్డికాపూల్లోని ఎఫ్‌టీటీసీ ఆడిటోరియంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డితో కలిసి చిన్నా రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిన్నా రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కోదండ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా దుర్వినియోగం కాకుండా రైతులకు అందించడంలో వ్యవసాయ అధికారుల పాత్ర కీలకమని, రైతుతో పాటు సెలవు లేకుండా పని చేస్తున్నారని కొనియాడారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, కృపాకర్, ప్రధాన కార్యదర్శి తులసి రామ్, ఏలూరి శ్రీనివాస్ రావు, కార్యదర్శి శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
