కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేదు

కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేదు

హైదరాబాద్: కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మోడీ ఉపన్యాసంపై సోమవారం బోయినపల్లి వినోద్ స్పందించారు. శ్రీలంక ప్రభుత్వంపై మోడీ ఒత్తిడి తెచ్చారో లేదో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మోడీ చేశారన్నారు. రూపాయి విలువ ఎందుకు తగ్గిందని, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశానికి కొత్తగా ఏమొచ్చిందని నిలదీశారు. కుటిల రాజనీతి స్మతి ఇరానీ దగ్గర ఉందని... కేసీఆర్ దగ్గర లేదన్నారు. కేసీఆర్ కు రాజకీయాల గురించి చెప్పే స్థాయి స్మృతి ఇరానీకి లేదని మండిపడ్డారు. పాలనను వదిలేసి కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పడుకుంటున్నారన్న ప్రతి పక్ష నాయకుల వ్యాఖ్యలను ఖండించిన ఆయన... కాళేశ్వరం, రైతు బంధు వంటి పథకాలు కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పడుకుంటేనే వచ్చాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ రోజుకు 18 గంటలు పని చేస్తారన్న వినోద్... ఆయన పని విధానం వల్లే ఇవాళ రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందన్నారు. మోడీకి కేసీఆర్ స్వాగతం చెప్పకపోవడాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని, గతంలో మోడీకి స్వాగతం చెప్పేందుకు కేసీఆర్ వెళ్తానంటే వద్దన్నది బీజేపీ కాదా అని ప్రశ్నించారు.