బండి సంజయ్ చెప్పేవన్నీ అబద్ధాలే

బండి సంజయ్ చెప్పేవన్నీ అబద్ధాలే

హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లపై బండి సంజయ్ తుగ్లక్లా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బండి సంజయ్ విమర్శలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కు తుప్పు పట్టిన సామగ్రిని వాడారని బండి సంజయ్ చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ నుంచే రాష్ట్ర ప్రభుత్వం సామగ్రిని కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుంభకోణం ఎలా జరుగుతుంది అని, అలాగైతే కేసీఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా? అని ఎద్దేవా చేశారు.

విద్యుత్ కొనగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే లక్ష్యంగా బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ఆయన... ఆరోపణలు చేసే ముందు నిజమా కాదా అని చూసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా పవర్ ఉత్పత్తి సంస్థలు కరెంట్ ధరలు విపరీతంగా పెంచాయని, వాటిని తగ్గించాలని గతంలోనే కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. ఆ లేఖకు స్పందించిన కేంద్రం.. ధరలు తగ్గించాలని ఎలక్ట్రిసిటీ రెగులేటరీ అథారిటీ కి లేఖ రాసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఉన్న ధర కంటే అధిక ధర వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. కావాలంటే అందుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలు అందిస్తామన్నారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ సంస్థలకు కాంట్రాక్టులు ఇస్తూ... వాటి బలోపేతాని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. అయితే కేంద్రం మాత్రం ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. 

మరిన్ని వార్తల కోసం...

అదృష్టమంటే విజయ్‌ శంకర్‌దే

వెదర్ అలర్ట్: రాష్ట్రానికి భారీ వర్ష సూచన