నిషేధించిన గడ్డి మందు అక్రమ రవాణా: ముఠా అరెస్ట్

నిషేధించిన గడ్డి మందు అక్రమ రవాణా: ముఠా అరెస్ట్

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన గ్లైపోసెట్ గడ్డిమందును అక్రమంగా రవాణా చేస్తూ క్యాష్ చేసుకుంటున్న ఐదుగురిని రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. ₹85 లక్షల విలువైన 16 వేల లీటర్ల గ్లైపోసెట్ ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మంచిర్యాలలో పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మైలారం గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి  గ్లైపోసెట్​ను అమ్ముతున్నాడన్న సమాచారంతో.. టాస్క్​ఫోర్స్, అగ్రికల్చర్ అధికారులు స్థానిక పోలీసులతో సోదాలు చేసి 250 లీటర్ల గ్లైపోసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుకున్నారు. ఆసిఫాబాద్​కు చెందిన సంతోశ్​తనకు సప్లై చేస్తున్నట్లు నిందితుడు చెప్పడంతో అక్కడా తనిఖీలు చేసి 1,200 లీటర్ల గ్లైపోసెట్ సీజ్ చేశారు. వీళ్లకు మంచిర్యాల జిల్లా వాసి బొల్లం మహేశ్​.. శ్రీనివాస ఫర్టిలైజర్స్​పేరిట కొన్ని నెలలుగా తక్కువ ధరకు గ్లైపోసెట్​ రహస్యంగా అమ్ముతున్నట్లు తేలింది. మహేశ్​ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్​లోని ఇన్​సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ (ఐఐఎల్​) కంపెనీతో సోదాలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన14,390 లీటర్ల గ్లైపోసెట్​ను స్వాధీనం చేసుకున్నారు. ఐఐఎల్​కంపెనీ మేనేజర్ ఆకుల రమేశ్ తో సహా ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.