
- రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్
హైదరాబాద్సిటీ, వెలుగు: రాష్ట్రంలో గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ ను ఈ నెల 30 లోపు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేకపోతే వచ్చే నెల 1,2న పౌర సరఫరాల శాఖ కార్యాలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించింది. సంఘం అధ్యక్షుడు నాయి కోటిరాజు, ట్రెజరర్ నాగరాజు మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో
మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 17,200 మంది రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. గత ఐదు నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ రాకపోవడంతో భవనం కిరాయిలు, హెల్పర్ జీతాలు ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదన్నారు.