
- కేంద్రం నుంచి 11 పర్మిషన్లు ఉన్నాయనేది పూర్తిగాఅబద్ధమని వెల్లడి
ఖమ్మం, వెలుగు: కాళేశ్వరానికి కేబినెట్ అనుమతి లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లోనూ ఇదే విషయం స్పష్టంగా చెప్పారన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పీఎస్ఆర్ ట్రస్ట్ కింద ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కూసుమంచి క్యాంప్ ఆఫీసులోనూ ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగింది, దీనికి కారకులెవరు అన్న వివరాలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఉన్నాయన్నారు. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పేరుతో పాటు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పీసీ ఘోష్ ఇచ్చిన 665 పేజీలలో వివరంగా ఉందని ఆయన చెప్పారు. ఆ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో హరీశ్ రావు చెప్పిందే చెప్పి అబద్ధాన్ని, నిజంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్రం నుంచి పదకొండు పర్మిషన్లు ఉన్నాయనీ, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడానికి కేబినెట్ అప్రూవల్ ఉందనేది అబద్ధమని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీని వేదికగా చేసుకుని రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చట్ట పరిధిలో నిర్ణయాలు తీసుకుంటామని పొంగులేటి అన్నారు. తాము కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరిని టార్గెట్ చేయడం లేదన్నారు.
కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలను కేసీఆర్ కుటుంబం దోచుకుందని విమర్శించారు. మరోసారి ఎన్నికల్లో ఆ డబ్బులు పంచేందుకు వస్తే, ఆ డబ్బులు తీసుకొని బీఆర్ఎస్కు చెంప చెల్లుమనిపించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.