సెక్రటేరియెట్ ఉద్యోగుల పే స్కేల్​పెంచాలి

సెక్రటేరియెట్ ఉద్యోగుల పే స్కేల్​పెంచాలి
  •     8% అదనపు హెచ్ఆర్ఏ​ ఇవ్వాలి
  •     పీఆర్సీ చైర్మన్​కు స్టేట్ సెక్రటేరియెట్​ అసోసియేషన్ వినతి 

హైదరాబాద్, వెలుగు :  ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్​ ఇచ్చేలా రికమండ్​ చేయాలని.. సెక్రటేరియెట్​ఉద్యోగస్తుల పే స్కేల్​ పెంచాలని పే రివిజన్​కమిషన్​ను తెలంగాణ స్టేట్ సెక్రటేరియెట్​ అసోసియేషన్(టీఎస్ఎస్ఏ) ప్రతినిధులు  కోరారు.  బీఆర్కే భవన్ లో శుక్రవారం పీఆర్సీ చైర్మన్ శివ శంకర్​ను టీఎస్ఎస్ఏ ప్రెసిడెంట్​సురేశ్ కుమార్, జనరల్​ సెక్రటరీ దేవేందర్​తో పాటు జాయింట్​ సెక్రటరీ స్వామి ఇతర ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా  ఉద్యోగుల పనిదినాలు వారానికి ఆరు రోజుల నుంచి 5 రోజులకు తగ్గించాలన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్​ఏ కల్పించాలన్నారు. గవర్నర్​ సెక్రటేరియెట్​ ఉద్యోగస్తులకు ఇస్తున్నట్లుగా సెక్రటేరియెట్​ ఉద్యోగస్తులకు 8 శాతం అదనపు హెచ్ఆర్ఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో నగదు రహిత వైద్య సేవలను  కల్పించాలని రిక్వెస్ట్ చేశారు. మహిళా ఉద్యోగులకు, చైల్డ్​ కేర్​ లీవ్స్​ను 90 రోజుల నుంచి 2 సంవత్సరాలకు పెంచేలా సిఫార్సు చేయాలన్నారు.

అసిస్టెంట్​సెక్రటరీలకు వాహన సదుపాయం కల్పించాలని, ఎలక్ర్టిక్​ వాహనాల కొనుగోలు కోసం వడ్డీ లేని కార్​, బైక్​ అడ్వాన్స్​లు కల్పించాలని తెలిపారు. పేషీ ఉద్యోగులకు  పేషీ అలవెన్స్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి కనీస వేతనాలను పెంచాలని టీఎస్ఎస్ఏని సెక్రటేరియెట్​ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.