గురుకులాలు దేశానికే ఆదర్శం

గురుకులాలు దేశానికే ఆదర్శం

హైదరాబాద్: గురుకులాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సైనిక్ స్కూల్, కాలేజీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం విడుదల చేశారు. రుక్మాపూర్ (కరీంనగర్) సైనిక్ స్కూల్, బీబీనగర్ ( బీబీనగర్) మహిళా సైనిక్ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం మార్చి 27న‌ ప‌రీక్ష నిర్వహించారు. పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.... అన్నివర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని, 5 సొసైటీలలో కలిపి మొత్తం 981 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని తెలిపారు. వీటిలో సుమారు 6 లక్షల మంది బాలబాలికలు చదువుతున్నారని, అందరికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామని వివరించారు.

అదేవిధంగా సైనిక్ స్కూల్, సైనిక్ డిగ్రీ కాలేజీల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇక్కడ చదివిన వాళ్లకు మంచి ఉద్యోగావకాశాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతునాయక్ ప్రవేశ పరీక్షలు, ఫలితాల గురించి మీడియాకు వెల్లడించారు. రుక్మాపూర్ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశ పరీక్ష 3,550 మంది రాయగా... ఫిజికల్, మెడికల్ టెస్టుల తర్వాత 78 మందికి ప్రవేశాలు లభించాయని నాయక్ తెలిపారు. సొసైటీలోని 30 మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకై నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్టుకు హాజరైన 25వేల మందిలో 965 మంది బీబీనగర్ కాలేజీని కోరుకున్నారని, వీరిలో 126 మందికి మాత్రమే ప్రవేశాలు లభించాయని పేర్కొన్నారు.