నిర్వాసితులకు ఆరోగ్య భద్రత కల్పించాలి

నిర్వాసితులకు ఆరోగ్య భద్రత కల్పించాలి

గోదావరిఖనిలోని  సింగరేణి ఏరియా ఆసుపత్రిలో.. రానున్న 75 రోజుల్లో అత్యాధునిక క్యాథల్యాబ్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  మొన్న  అసెంబ్లీ వేదికగా ప్రకటించడం హర్షణీయం. బొగ్గు గనుల ప్రాంతంలో ఆరోగ్య భద్రతకు సంబంధించి ఇదొక శుభ పరిణామం.  

మారుతున్న జీవనశైలి,  పని ఒత్తిళ్లు, కాలుష్య కోరల్లో చిక్కుకుని గుండె సంబంధిత వ్యాధులు నానాటికీ పెరుగుతున్న తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం కార్మిక లోకానికి పెద్ద ఊరట. అయితే, ఈ వైద్య సేవలు కేవలం కార్మికులకే పరిమితం కాకూడదన్నది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న వాదన. దీనిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సింగరేణి సంస్థ అంటే కేవలం బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ మాత్రమే కాదు.  అదొక సామాజిక బాధ్యత కలిగిన వ్యవస్థ.  గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో  ఏర్పాటు కాబోయే క్యాథల్యాబ్  సేవలను కేవలం సంస్థ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేస్తే.. అది అసంపూర్ణ  నిర్ణయమే అవుతుంది. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న సామాన్య ప్రజానీకానికి కూడా ఈ ద్వారాలు తెరుచుకోవాలి.  

ముఖ్యంగా  గనుల  విస్తరణలో తమ భూములు, ఇళ్లు, తరతరాల జ్ఞాపకాలను త్యాగం చేసిన నిర్వాసిత ప్రజలకు ఈ సేవలు ఉచితంగా అందించాలి. సింగరేణి గనుల నుంచి వెలువడే  దుమ్ము,  ధూళి, వాయు కాలుష్యం, కలుషిత నీటిని ఆ ప్రాంత ప్రజలు నిత్యం భరిస్తున్నారు.

 పరోక్షంగా ఈ కాలుష్యమే అనేక గుండె, ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతోంది. అలాంటప్పుడు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రభావిత గ్రామాల ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించడం సింగరేణి నైతిక బాధ్యత.

త్యాగాల పునాదులపైనే..

సింగరేణి సంస్థ ఈరోజు ఆసియాలోనే అగ్రగామిగా నిలిచిందంటే.. దాని వెనుక వేలాది మంది భూనిర్వాసితుల కన్నీటి గాథలు ఉన్నాయి. పుట్టిన ఊరును, పెరిగిన వాతావరణాన్ని, సామాజిక బంధాలను వదులుకుని సంస్థ అభివృద్ధికి బాటలు వేసిన ఆ మట్టి మనుషుల త్యాగం వెలకట్టలేనిది. 

నష్టపరిహారంగా ఇచ్చే డబ్బుతోనో, ఇంటి స్థలంతోనో ఆ రుణం తీరదు.   సంస్థ కోసం భూమిని త్యాగం చేసిన రైతన్న,  అదే సంస్థ తవ్వకాల వల్ల వచ్చే కాలుష్యంతో గుండె జబ్బుల బారిన పడితే.. ‘నువ్వు కార్మికుడివి కాదు, నీకు వైద్యం అందదు’ అని గెంటేయడం ధర్మం కాదు.  సింగరేణి కార్మికులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న అన్ని రకాల వైద్య, ఇతర సౌకర్యాలను భూ నిర్వాసితులకు కూడా వర్తింపజేయాలన్న డిమాండ్ న్యాయమైనది.

మంత్రుల బాధ్యత 

సింగరేణి ప్రాంతాలైన మంథని, చెన్నూరు నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది రాష్ట్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి ఈ బాధ్యతను తమ భుజాలకు ఎత్తుకోవాలి. కోల్​బెల్ట్ ప్రజాప్రతినిధులు ఒక విషయాన్ని విస్మరించకూడదు. ఎన్నికల్లో గెలుపునకు కేవలం సింగరేణి కార్మికుల ఓట్లు మాత్రమే కారణం కాదు. 

సంస్థతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, పరోక్షంగా సంస్థ ప్రభావానికి లోనవుతున్న లక్షలాది మంది సామాన్య ప్రజల ఓట్లు కూడా ఇందులో కీలకం. గత పదేండ్లుగా సింగరేణితో సంబంధంలేని నాటి ప్రభుత్వ ప్రముఖుల నియోజకవర్గాలకు సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ నిధులను తరలించారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఆ అన్యాయాన్ని ప్రశ్నించిన మీరు.. నేడు అధికారంలో ఉండి అదే తప్పు పునరావృతం చేయడం సరికాదన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

ఉన్నతస్థాయి సమావేశమే వేదిక కావాలి

సింగరేణి మనుగడ,  సంక్షేమంపై  చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన పది రోజుల్లోగా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎండీతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సమావేశంలో సింగరేణి ప్రభావిత ప్రాంత అభివృద్ధి, భూ నిర్వాసితుల సంక్షేమం కోసం  ప్రధానంగా చర్చ జరగాలి. 

తమకు అన్నం పెట్టే భూములను త్యాగం చేసిన నిర్వాసిత గ్రామాలను ఆదుకునేందుకు, సింగరేణి వైద్య సేవలను,  క్యాథల్యాబ్ సేవలను అందరికీ వర్తింపజేసేందుకు ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.  నిర్వాసిత ప్రజల ఆరోగ్యం- సింగరేణి బాధ్యత అని నిరూపించుకోవడానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఇదొక చక్కటి అవకాశం. 

దేశానికి వెలుగులు పంచేందుకు భూములు,  ఇండ్లను త్యాగం చేసి తమ బతుకులను చీకటి చేసుకున్న నిర్వాసితులకు సింగరేణి ఏమిచ్చినా తక్కువే. కనీసం వారికి ఆరోగ్య సేవలు అందించి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత సంస్థదే.

- డేగ కుమార్ యాదవ్,సీనియర్ జర్నలిస్ట్