పిల్లలను కాపాడుకునేందుకు కొవిడ్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌

పిల్లలను కాపాడుకునేందుకు కొవిడ్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌

న్యూఢిల్లీ: మహమ్మారి సెకండ్​ వేవ్​ భయాలు పోకముందే.. థర్డ్​ వేవ్​ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడో వేవ్​లో పిల్లలపైనే ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న వార్నింగ్​లతో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ముందే సిద్ధమైపోతున్నాయి. థర్డ్​ వేవ్​లో పిల్లలను కాపాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర​ప్రదేశ్​, కర్నాటక, ఉత్తరాఖండ్​ వంటి రాష్ట్రాలు చర్యలు మొదలుపెట్టేశాయి. పిల్లల కొవిడ్​ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేశాయి. పిల్లల కోసం ఐసీయూ బెడ్లు, కొవిడ్​ కేర్​ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 

యూపీలో ఐసీయూ బెడ్లు

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ పిల్లల కోసం 100 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేసేందుకు యూపీ సర్కారు కసరత్తులు చేస్తోంది. అంతేగాకుండా 10 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులందరికీ కరోనా వ్యాక్సిన్​ వేయాలని నిర్ణయించినట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్​ ప్రకటించారు. థర్డ్​ వేవ్​కు ముందు నుంచే సిద్ధమవుతున్నట్టు చెప్పారు. 10 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు వ్యాక్సిన్​ వేయడం ద్వారా ఆ కుటుంబాలకు ‘రక్షణ కవచాన్ని’ ఏర్పాటు చేసినట్టు అవుతుందన్నారు. జర్నలిస్టులు, జ్యుడీషియల్​ అధికారులు, వారి కుటుంబాలకు ఇప్పటిదాకా లక్నో, నోయిడాల్లోనే కరోనా టీకాలు వేస్తున్నారని, ఇకపై ప్రతి జిల్లాకూ ఆ కార్యక్రమాన్ని విస్తరిస్తామని తెలిపారు. ప్రతి మెడికల్​ కాలేజీలోనూ పిల్లల కోసం 100 ఐసీయూ బెడ్ల ఏర్పాటుకు ఆదేశించామన్నారు. 300 ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. 

మహారాష్ట్రలో ఇలా..

పిల్లల్లో కరోనా వేవ్​ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. పిల్లలకు అవసరమైన మందులు, పీడియాట్రిక్​ వెంటిలేటర్లు, ఆక్సిజన్​ మాస్కులు, ఇతర పరికరాలను సమకూర్చుకోవడంపై టాస్క్​ఫోర్స్​ పనిచేస్తుంది. పిల్లలకు కొవిడ్​ కేర్​ సెంటర్లనూ ఏర్పాటు చేస్తోంది. కరోనా ముప్పు ఎక్కువన్న ఆందోళనలతో ఇప్పటికే గర్భిణులకు ట్రీట్​ చేసే ఆస్పత్రులను కొవిడ్​ ఆస్పత్రులుగా మార్చొద్దని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్​ తోపె ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రమంతటా 150 ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 38 ప్లాంట్ల ఏర్పాటు పనులు నడుస్తున్నాయి. రెమ్డిసివిర్​, బ్లాక్​ఫంగస్​ మందులను ఇంపోర్ట్​ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. కర్నాటక కూడా కొవిడ్​ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కార్డియాలజిస్ట్​ డాక్టర్​ దేవి శెట్టి ఆధ్వర్యంలో ఆ టాస్క్​ఫోర్స్​ పనిచేస్తుంది. పెద్ద సంఖ్యలో కొవిడ్​ కేర్​ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. అన్ని జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. అదే బాటలో ఢిల్లీ, ఉత్తరాఖండ్​లు నడుస్తున్నాయి. 
పిల్లల్లో భారీగా పెరిగిన కేసులు

కరోనా ఫస్ట్​వేవ్​లో పిల్లలకు కరోనా సోకిన ఘటనలు తక్కువే అయినా.. సెకండ్​వేవ్​లో విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 24 వరకు 10 ఏళ్ల లోపున్న 81,188 మందికి కరోనా సోకితే.. మే 6 నాటికి లక్షా 49 వేల 224కి పెరిగాయి. అంటే నెలన్నరలోనే 67 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అదే 11 నుంచి 20 ఏళ్ల మధ్య వారిలో కేసులను చూస్తే.. మార్చి 24 వరకు 1.66 లక్షల కేసులొచ్చాయి. ఆ తర్వాత నెలన్నరలోనే రెట్టింపయ్యా యి. 3.38 లక్షలకు కేసులు పెరిగాయి. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వారిలో 4.15 లక్షల నుంచి 8.67 లక్షలకు కరోనా కేసులు పెరిగాయి.