ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టు నీటితో రిజర్వాయర్లు నిండిపోవడంతో పంటల దిగుబడి పెరిగిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ నక్కలగుట్ట విద్యుత్ భవన్‌లో మంగళవారం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల వలన రిజర్వాయర్లకు నీరు రావడంతో స్టేషన్ఘన్పూర్ రైతులకు మేలు జరిగిందన్నారు. నియోజకవర్గానికి కొత్తగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు మంజూరు చేసినందుకు సీఎండీకి కృతజ్ఞతలు తెలిపారు.
సాగరం, కొండాపూర్, కూర్చపల్లి సబ్‌స్టేషన్లను మార్చి నెలాఖరులోపు చార్జ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మిగతా సబ్‌స్టేషన్ల టెండర్ ప్రక్రియ, భూ కేటాయింపు వంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇందిరమ్మ గృహాలపై వెళ్లుతున్న విద్యుత్ లైన్లను తొలగించి, అవసరమైన చోట కొత్త లైన్ల విస్తరణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ వి.మోహన్ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ టి.మధుసూదన్, సీఈలు రాజు చౌహన్, సురేందర్, ట్రాన్స్‌కో సీఈ(జోన్ వరంగల్) రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
