విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం :  ఎమ్మెల్యే కడియం శ్రీహరి
  • స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

ధర్మసాగర్, వెలుగు : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం ధర్మసాగర్ మండలం కరుణపురంలోని స్టేషన్ ఘనపూర్ మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో డిస్ట్రిక్ట్ లెవల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ఆయన వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మాజ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులను స్మరించుకోవాలని సూచించారు.

 ఆ మహనీయుల వల్లే నేడు పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు సమాజంలో తలెత్తుకొని జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1020 గురుకుల పాఠశాలలు, 400కు పైగా కస్తూర్బాగాంధీ పాఠశాలలు, 200పై చిలుకు మోడల్ పాఠశాలలు ఉన్నాయని వివరించారు. మొత్తం 1600 పైగా ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలల్లో సుమారు 8 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్సీవో రాజ్ కుమార్, ప్రిన్సిపాల్స్, టీచర్లు, పీఈటీలు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.