ఆటిజంకు స్టెమ్ సెల్ చికిత్స ఇల్లీగల్... సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్ఎంసీ అడ్వైజరీ

ఆటిజంకు స్టెమ్ సెల్ చికిత్స ఇల్లీగల్... సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్ఎంసీ అడ్వైజరీ
  •     రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డాక్టర్లకు హెచ్చరిక
  •     రక్త సంబంధిత క్యాన్సర్లు, ఇతర కొన్ని రోగాలకే అనుమతి

హైదరాబాద్, వెలుగు: ఆటిజం చికిత్స కోసం స్టెమ్ సెల్ థెరపీ(మూలకణ చికిత్స) చేయడంపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, డాక్టర్లకు బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని సాధారణ చికిత్సగా వాడడం చట్టవిరుద్ధమని, రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంది. 

యష్ చారిటబుల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని, ప్రామాణిక చికిత్సగా ఇంకా గుర్తింపు రాలేదని స్పష్టం చేసింది.

తప్పుడు ప్రకటనలతో ప్రజలను దోచుకుంటున్నాయి

సెంట్రల్ హెల్త్ డిపార్ట్​మెంట్ లిస్టు ప్రకారం కొన్ని రకాల రక్త సంబంధిత వ్యాధులు, క్యాన్సర్లకు మాత్రమే స్టెమ్ సెల్ థెరపీని వాడాల్సి ఉంటుంది. అక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా, మల్టిపుల్ మైలోమా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి 18 రకాల జబ్బులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఒకవేళ లిస్టులో లేని రోగాలకు స్టెమ్ సెల్స్ వాడాలనుకుంటే ప్రభుత్వ పర్మిషన్ తో క్లినికల్ ట్రయల్స్ మాత్రమే చేపట్టాలి. 

రీసెర్చ్ లో భాగంగా పేషంట్ కు ఏదైనా హాని జరిగినా, ప్రాణాపాయం సంభవించినా హాస్పిటల్స్ పూర్తి బాధ్యత వహించి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ఆటిజంను స్టెమ్ సెల్స్ ద్వారా పూర్తిగా నయం చేస్తామని కొన్ని ప్రైవేట్ క్లినిక్‌ లు తప్పుడు ప్రకటనలతో ప్రజలను దోచుకుంటున్నాయని, ఇలాంటి ట్రీట్​మెంట్ చేసే సంస్థలు, డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్ఎంసీ సెక్రటరీ డాక్టర్ రాఘవ్ లంగర్ హెచ్చరించారు.