సెంటిమెంట్​ను వాడుకొని డెవలప్‌మెంట్‌ని మరిచారు: పొన్నం ప్రభాకర్​

సెంటిమెంట్​ను వాడుకొని డెవలప్‌మెంట్‌ని మరిచారు: పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : కేసీఆర్​ కుటుంబ సెగ్మెంట్లలో నీళ్లు పారించుకొని హుస్నాబాద్​ నియోజకవర్గంలో కన్నీళ్లు నింపారని కాంగ్రెస్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. హుస్నాబాద్​ నుంచి ప్రచారం చేస్తే బీఆర్​ఎస్​ గెలుస్తుందనే సెంటిమెంట్​ ఉన్న కేసీఆర్ పదేండ్లుగా​ ఈ ప్రాంతాన్ని ఎందుకు డెవలప్​  చేయలేదని ​ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్​లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్​ఎస్​ అభ్యర్థి వొడితల సతీశ్​కుమార్​పై 14 అంశాలతో కూడిన చార్జిషీట్​ విడుదల చేశారు.

గజ్వేల్,  సిద్దిపేట నియోజకవర్గాలకు యుద్ధప్రాతిపదికన నీళ్లు తరలించి, హుస్నాబాద్​ను ఎండబెట్టారన్నారని మండిపడ్డారు. కుర్చేసుకొని కూసుంట, ప్రాజెక్టు ఎట్ల పూర్తిగాదో జూత్త అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లు గడిచిపోయినా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేయలేదన్నారు. నిర్వాసితుల ఇండ్లపై వందలాదిమంది పోలీసులను ఉసిగొలిపి మహిళలు, వృద్ధులను కూడా విచక్షణారహితంగా కొట్టించారన్నారు. ప్రాజెక్టు పేరుతో ఎమ్మెల్యే అనుచరులు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.  

హుస్నాబాద్ ప్రాంతంపై కుట్రపూరితంగానే వివక్ష చూపారన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే దద్దమ్మతనంతో ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం హుస్నాబాద్ ను సిద్దిపేటలో విలీనం చేసి, తీరని అన్యాయం చేశారని ఆగ్రహించారు. కాంగ్రెస్ ఆరు  గ్యారంటీలు ప్రామిసరీ నోట్ల లాంటివని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ కు మించిన మరొక రాజకీయ పార్టీ లేదన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నిదర్శనమని చెప్పారు.