సైబరాబాద్ పరిధిలోని పబ్లను నిబంధనల ప్రకారమే నిర్వహించాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. తక్కువ వయస్సు గల వ్యక్తులను పబ్లకు అనుమతించొద్దని చెప్పారు. నిబంధనలకు లోబడి ధ్వని స్థాయిలు ఉండాలని పబ్ యజమానులకు సూచించారు. పబ్బులపై పరిసర ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో... నివాసితులకు అసౌకర్యం కలిగించవద్దన్నారు. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి పౌరులకు ఎటువంటి అసౌకర్యాన్ని కల్పించొద్దన్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పబ్ ల యజమానులతో స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ ఖ్యాతిని నిలబెట్టాలి..
సైబరాబాద్ పరిధిలోని పబ్ల నిర్వహణ బాధ్యతాయుతంగా నిర్వహించాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని నిబంధనలు, లైసెన్సింగ్ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. బ్యాకప్‌తో కూడిన CCTV లను, ఫీడ్‌ను పర్యవేక్షించడానికి, ప్రాంగణాన్ని సౌండ్‌ప్రూఫ్ చేయడానికి, వాలెట్ డ్రైవర్‌లను నిమగ్నం చేయడానికి, సిబ్బంది, కస్టమర్లను పరీక్షించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని మేనేజ్‌మెంట్‌లకు సూచించారు. సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత యజమాన్యందే అన్నారు. హైదరాబాద్ నగరం, రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టాలన్నారు.
