IPL 2024: మా దేశానికి రా చూసుకుందాం: మయాంక్‌కు వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ ఛాలెంజ్

IPL 2024: మా దేశానికి రా చూసుకుందాం: మయాంక్‌కు వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ ఛాలెంజ్

ఐపీఎల్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మయాంక్ యాదవ్ అనే చెప్పాలి. ఈ యువ 21 ఏళ్ళ యువ బౌలర్ తన బౌలింగ్ తో ఒక్కసారిగా ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. పేస్ ఎవరైనా వేస్తారు.. కానీ మయాంక్ మాత్రం నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు. బ్యాటర్ ఎవరైనా ఇతని బౌలింగ్ ధాటికి కుదేలవుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టడమే కాదు.. పొదుపుగా బౌలింగ్ చేస్తూ సంచలనంగా మారాడు. ఇదిలా ఉంటే ఈ యువ బౌలర్ కు ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఛాలెంజ్ విసిరాడు. 

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది ఆఖర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ సిరీస్ లో మయాంక్ ఖచ్చితంగా ఆడాలని.. అతని   బౌలింగ్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మయాంక్ కు స్మిత్ ఛాలెంజ్ విసిరాడు. ఐపీఎల్ లో మయాంక్ బౌలింగ్ తీరు అద్భుతంగా ఉందని..కచ్చితత్వంతో కూడిన బంతులు వేయడం అంత ఈజీ కాదని ఈ ఆసీస్ స్టార్ ప్రశంసలు కురిపించాడు. 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే బౌలర్​ను ఎదుర్కోవాలంటే మంచి బంతులకు కూడా రిస్క్ తీసుకోక తప్పదని.. కానీ ఇది చాలా కష్టమైన పని అని స్మిత్ అన్నాడు.

నిన్న (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో మయాంక్ యాదవ్ మరోసారి అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కామెరూన్ గ్రీన్, మ్యాక్స్ వెల్,పటిదార్ లాంటి కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మయాంక్ ఇలాగే రాణిస్తే భారత జట్టులోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.