
- అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆవేదన
- కాంట్రాక్టులు, కాలేజీలు, రివార్డులు అన్నింటికి వాళ్లేనా?అంటూ వ్యాఖ్యలు
వెలుగు, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి ఆరేండ్లయినా.. ఆంధ్రోళ్ల పెత్తనం మన రాష్టాన్ని పట్టి పీడిస్తోందని ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా గొంతెత్తుతున్నారు. నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్‌లైన్‌తో తెచ్చుకున్న తెలంగాణ అస్తిత్వం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందని వేలెత్తి చూపిస్తున్నారు. వివిధ రంగాల్లో ఆంధ్రోళ్ల డామినేషన్ రాష్ట్ర ప్రజలను వీడని నీడలా వెంటాడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్సమావేశాల్లో గడిచిన రెండ్రోజులుగా సభ్యుల నోట వివిధ సందర్భాల్లో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీ దోపిడీకి వ్యతిరేకంగానే తెలంగాణ ఏర్పడిందని పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తలంటారు.
విపక్ష సభ్యులతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లేవనెత్తటం గమనార్హం. సీమాంధ్ర కాంట్రాక్టర్లకే ప్రాజెక్టులు, పనులు అప్పగిస్తున్నారని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అవకాశం దొరికినప్పుడల్లా అధికార పార్టీపై ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగాలు కల్పించే పరిశ్రమల్లో ప్రతిచోట మన వాళ్లకు అన్యాయమే జరుగుతోందని తాజాగా సభలో చర్చకు వచ్చింది. రాష్ట్రంలో ఏపీ విద్యా సంస్థలే పెత్తనం చెలాయిస్తున్నాయని, లక్షలాది రూపాయల ఫీజుల మోత మోగిస్తున్నాయని, మన విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేయగా.. పేరు ప్రతిష్టలు పెరగాలంటే మన తెలంగాణలోని ప్రతిభావంతులను ఎంకరేజ్ చేయాలని మరో యువ ఎమ్మెల్యే సర్కారుకు హితబోధ చేశారు. ఆంధ్రోళ్ల పెత్తనం లేకుండా చర్యలు తీసుకోవాలని, మన వాళ్లకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
వాళ్ల కాలేజీలదే ఫీజుల మోత
రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ అన్యాయానికి గురవుతున్నరు. శ్రీ చైతన్య, నారాయణను ఎవ్వరు కూడా ఏం చేయలేకపోతున్నరు. ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి మూడు లక్షలు వసూలు చేస్తుంటే మీరు మన ప్రైవేట్ స్కూల్స్‌ను కంట్రోల్ చేస్తామంటున్నరు. ఇన్ని సంవత్సరాలైనా వాటినుంచి విముక్తి జరుగకపోతే మన విద్యార్థులకు అన్యాయం చేసిన వాళ్లం అవుతం.
మనోళ్లను ఎంకరేజ్ చేద్దాం
‘గోపీచంద్ అయిన, సింధు అయిన.. మన తెలంగాణ బిడ్డలు కారు. వాళ్ల పేర్లు చెప్పుకొని వాళ్లకు ప్రైజులు ఇచ్చుకుంటున్నం. మన గ్రామాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు చాలా మంది ఉన్నరు. మనం వాళ్లకు ఎంకరేజ్‌మెంట్ చేస్తే ఇంకా మన పేరు ప్రతిష్టలు.. తెలంగాణ బిడ్డల పేరు ప్రతిష్టలు పెరుగుతయి..
ఆంధ్రా కాంట్రాక్టర్ల డిజైన్లు
‘కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఈ రోజు సీమాంధ్ర పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు అదే ప్రాజెక్టును డిజైన్ చేశారు. తెలంగాణ ఉద్యమం నడిచింది ఉద్యోగాల పేరు మీద. కానీ 90 పర్సెంట్ అదే ఇండస్ట్రీస్‌లల్ల ఆంధ్రవాళ్లు గానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే. టెన్ పర్సెంట్ ఎంప్లాయిమెంట్ కూడా మన లోకల్ పీపుల్‌కు లేదు.