ధరణితో అవే ఎతలు

ధరణితో అవే ఎతలు
  • పోర్టల్​లో పూర్తి స్థాయిలో నమోదు కాని మ్యుటేషన్లు
  • సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయినా.. రెవెన్యూ రికార్డులకు ఎక్కని కొత్త ఓనర్ల పేర్లు
  • కొన్ని చోట్ల సర్వే నంబర్​లో ఉన్న భూమికి మించి రిజిస్ట్రేషన్లు
  • ఆర్ఎస్ఆర్ తేడాలతో పాస్ పుస్తకాలు జారీ చేయలేని పరిస్థితి
  • నెలన్నర దాటినా అందుబాటులోకి రాని కొత్త మాడ్యుల్స్

హైదరాబాద్, వెలుగు: ధరణిలో భూరికార్డుల ఎంట్రీలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులు రైతులను వెంటాడుతున్నాయి. భూమి ఉండి, కాస్తులో ఉన్నా కొందరికి పాస్ బుక్స్ రాలేదు. మరికొందరికి భూమి లేకపోయినా పాస్ బుక్స్ వచ్చాయి. కొన్ని చోట్ల భూమి ఉండి, కొత్త పాస్ బుక్స్ కలిగి ఉన్నా ధరణి పోర్టల్​లో చూస్తే ఆ వివరాలు కనిపించట్లేదు. కొన్ని సర్వే నంబర్లలో ఉన్న భూ విస్తీర్ణానికి మించి పాస్ బుక్స్ జారీ చేయడంతోపాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో రీ సెటిల్మెంట్ రిజిష్టర్(ఆర్ఎస్ఆర్)లోని విస్తీర్ణానికి మించి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు చేయడంతో మ్యుటేషన్ చేయడం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది.

కార్డు డేటా ఒకలా.. ధరణి డేటా మరోలా..
రెవెన్యూ శాఖలో ప్రస్తుతం ధరణి అందుబాటులో ఉండగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చాలా ఏండ్ల నుంచే కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(కార్డు) సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడానికి ముందు వ్యవసాయ భూములు అనేకం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేల్ డీడ్ ద్వారా రిజిష్టర్ అయ్యాయి. ఇలాంటి భూములు అనేకం ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. కొనుగోలుదారుల వద్ద రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నా.. రెవెన్యూ రికార్డుల్లోకి వచ్చేసరికి పాత యజమానుల పేర్లు, లేదంటే వేరొకరి పేర్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతి, నిర్లక్ష్యం కారణంగా చాలా మ్యుటేషన్లు పెండింగ్ లో ఉండిపోయాయి. కొందరు తెలియక ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఇలాంటి ప్రాపర్టీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ.. ధరణిలో మాత్రం మ్యుటేషన్ కావడం లేదు. ఇలా మ్యుటేషన్ పెండింగ్ లో ఉండి ధరణిలో మళ్లీ తమ పేర్లే వచ్చినట్లు గుర్తించిన కొందరు పాత ఓనర్లు అత్యాశతో వేరొకరికి అమ్మేస్తున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లు కొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి. కార్డు డేటాతో ధరణి డేటాకు సమన్వయం లేదని, ధరణికి ముందు నుంచి పెండింగ్ లో మ్యుటేషన్లకు పరిష్కారం చూపకపోతే డబుల్ రిజిస్ట్రేషన్లు ఆపలేమని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి.

జారీ కాని కొత్త పాస్ పుస్తకాలు 
గ్రామాల్లో పాత పాస్ బుక్స్ ఉన్న లక్షల మంది రైతులకు కొత్త పాస్ బుక్స్ జారీ కాలేదు. ఇందులో రీ సెటిల్మెంట్ రిజిష్టర్(ఆర్ఎస్ఆర్) లో తేడాల వల్ల పాస్ బుక్స్ జారీ కాలేదు. ఒక సర్వే నంబర్ లోని భూమిని బై నంబర్ల వారీగా ఎంత విభజించినా అందులోని అసలు భూమి విస్తీర్ణాన్ని మించొద్దు. ఉదాహరణకు ఒక సర్వే నంబర్ లో 20 ఎకరాల భూమి ఉంటే.. 30 ఎకరాలు ఉన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయడం, మాన్యువల్ పహనీలు జారీ చేయడంలాంటి ఘటనలు అనేకం గతంలో జరిగాయి. ఇలాంటి భూములకు ఇప్పుడు ధరణి ద్వారా పాస్ బుక్స్ జారీ చేయడం కుదరడం లేదు. ఇందులో రెవెన్యూ అధికారులను ముందు ఎవరైతే సంప్రదిస్తారో, ఎవరైతే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడతారో వారి పేరిట పాస్ బుక్స్ ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చినవారు, డబ్బులు ఇవ్వని వాళ్లను మాత్రం ఆ సర్వే నంబర్ లో పాస్ బుక్ ఇవ్వడానికే భూమి లేదని తిప్పిపంపుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

లక్షలాది సర్వే నంబర్లు మిస్సింగ్..
ఆరేడు దశాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్లో వస్తున్న సర్వే నంబర్లు ధరణి పోర్టల్ లో మాయమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లు కనిపించకుండా పోయినట్లు రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఫిర్యాదులు, వేలాది మంది రైతులు మీ సేవా కేంద్రాలు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో ప్రభుత్వం నిర్వహించిన మా భూమి, వెబ్ ల్యాండ్, ఐఎల్ఆర్ఎంఎస్, టీల్యాండ్ పోర్టల్స్ లో కనిపించిన చాలా సర్వే నంబర్లు, బైనంబర్లు ధరణిలో మాయమయ్యాయి. ధరణిలోని ల్యాండ్ డీటైల్స్ సెర్చ్ ఆప్షన్లో భూముల వివరాల కోసం వెతికితే పాస్​బుక్స్ ఇవ్వని భూముల వివరాలు కనిపించడం లేదు. కొత్త పట్టాదారు పాస్​బుక్స్​లో ఉన్న లక్షలాది సర్వే నంబర్లు మాయమయ్యాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మిస్సయిన సర్వే నంబర్లను తమ పేరిట నమోదు చేయాలని ధరణి గ్రీవెన్స్ మాడ్యుల్ ద్వారా అప్లై చేస్తే కొద్ది రోజులకు గ్రీవెన్స్ అడ్రస్డ్ బై కలెక్టర్ అని చూపుతోంది. కానీ సమస్య పరిష్కారం కావడం లేదు.

అందుబాటులోకి రాని కొత్త మాడ్యుల్స్
ధరణి పోర్టల్ లో కొత్త మాడ్యూల్స్ చేర్చాలని, తహసీల్దార్లు, కలెక్టర్ల స్థాయిలో మరిన్ని ఆప్షన్లు ఇవ్వాలని ధరణిపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సూచించి నెలన్నర దాటినా ఇప్పటి వరకు అవేవీ అందుబాటులోకి రాలేదు. ధరణి పోర్టల్ తో రైతులకు ఎలాంటి సమస్యలు లేవని మొదట్లో కొద్ది నెలల వరకు బుకాయించిన ప్రభుత్వం.. ఏడాది తర్వాత అందులో అనేక ఇబ్బందులు ఉన్నట్లు అంగీకరించి ఆర్థిక మంత్రి హరీశ్ రావు చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 12న మొదటిసారి సమావేశమైనప్పుడే సుమారు 20 రకాల సమస్యలు సబ్ కమిటీ దృష్టికి వచ్చాయి. రెండో మీటింగ్​లో మరికొన్ని కొత్త సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో సుమారు 42 రకాల సమస్యల పరిష్కారానికి మాడ్యూల్స్ రెడీ చేయగా.. అందుకు సంబంధించిన రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించి డిసెంబర్ 2న సీఎం కేసీఆర్ కు సమర్పించింది. సబ్ కమిటీ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఇంకా ఓకే చెప్పకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

భూమి ఉంది.. బుక్ రాలేదు..
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లికి చెందిన మచ్చ రాములుకు సర్వే నంబర్ 550/4లో 13 గుంటల భూమి ఉంది. ఆయన కుటుంబమే ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో ఈ భూమిపై పాస్ బుక్ జారీ కాలేదు. దీంతో రాములు కుటుంబ సభ్యులు ఆర్టీఐ ద్వారా తహసీల్దార్ ఆఫీసులో సమాచారం కోరగా అసలు ఆ సర్వే నంబర్ లో భూమే లేదని సమాధానమిచ్చారు. 1973 నుంచి పహనీలో 13 గుంటల భూమి తన పేరిటే ఉందని, గతంలో పాసుబుక్స్ వచ్చాయని, భూమి శిస్తు రశీదు ఉందని, ఇప్పటికీ ఆ భూమిలో వరి పండిస్తున్నా రెవెన్యూ ఆఫీసర్లు పాస్ బుక్ ఇవ్వడం లేదని రాములు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లు లేని సమస్య ధరణి తెచ్చినంకనే వచ్చిందని వాపోయాడు.