మార్కెట్ జూమ్ ..ఇన్వెస్టర్లకు రూ.12 లక్షల కోట్ల లాభం

మార్కెట్ జూమ్ ..ఇన్వెస్టర్లకు రూ.12 లక్షల కోట్ల లాభం
  • 639 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఇన్వెస్టర్లకు రూ.12 లక్షల కోట్ల లాభం
  • 2.55 శాతం పెరిగిన నిఫ్టీ
  •  ఇన్వెస్టర్లకు రూ.12 లక్షల కోట్ల లాభం
  • 1.36 శాతం లాభపడ్డ రూపాయి​

న్యూఢిల్లీ:భారత్– అమెరికా వాణిజ్య ఒప్పందం స్టాక్​మార్కెట్లలో జోష్​ నింపింది. రూపాయి కూడా భారీగా పెరిగింది. సెన్సెక్స్ మంగళవారం 2,072.67 పాయింట్లు పెరిగి 83,739.13 వద్ద ముగిసింది. ఇది 2.54 శాతం వృద్ధిని సాధించింది. ఒకదశలో నాలుగు వేల పాయింట్ల వరకు దూసుకెళ్లింది. నిఫ్టీ 50 సూచీ 639.15 పాయింట్లు లాభపడి 25,727.55 వద్ద స్థిరపడింది. ఇది 2.55 శాతం పెరిగింది. 2024 నవంబర్ 22 తర్వాత సెన్సెక్స్ సాధించిన అతిపెద్ద ఒక్కరోజు లాభం ఇదే కావడం విశేషం. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.12 లక్షల కోట్లు పెరిగి రూ.467.35 లక్షల కోట్లకు చేరింది. అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్​లో టెక్​మహీంద్రా, బీఈఎల్​ మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి.

రియల్టీ.. టాప్ ​గేనర్​

మార్కెట్లలో రియల్టీ రంగం దాదాపు 4.8 శాతం పెరిగి టాప్​ గేనర్​గా నిలిచింది. ఇన్​ఫ్రా, ఎనర్జీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు కూడా లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ ఒక దశలో 61,764 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకి చివరకు 60,041.30 వద్ద ముగిసింది. నిఫ్టీ  షేర్లలో అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ 10.58 శాతం పెరిగి రూ.2,206.50 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్ 9.19 శాతం లాభపడింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో షేర్లు మంచి వృద్ధిని కనబరిచాయి. టెక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్​బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నెస్లే ఇండియా స్వల్పంగా నష్టపోయాయి. బీఎస్​ఈలో 3,279 షేర్లు లాభాల్లో ముగియగా 1,015 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్– 100, స్మాల్ క్యాప్ –100 సూచీలు దాదాపు 2.8 శాతం చొప్పున పెరిగాయి.

రూపాయి దూకుడు

వాణిజ్య ఒప్పందం ప్రకటన తర్వాత రూపాయి విలువ రూ.1.28 (దాదాపు 1.36 శాతం) బలపడింది. ప్రస్తుతం డాలర్‌‌తో పోలిస్తే రూపాయి 90.25 వద్ద ఉంది. గత వారంలో పడిపోయిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు పెరుగున్నాయి.  వాణిజ్య ఒప్పందం వల్ల ఆటో, డిఫెన్స్, టెక్స్‌‌టైల్స్ రంగాలకు మేలు జరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధి సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. మార్కెట్ ఆందోళనను సూచించే ఇండియా విక్స్ 7 శాతం తగ్గి 12.89కు చేరింది.   వడ్డీరేట్లపై ఆర్‌‌బీఐ ప్రకటన మార్కెట్​కు కీలకంగా మారనుంది.

ఎంసీఎక్స్​లో వెండి రూ.29 వేలు అప్​

 బులియన్ మార్కెట్ మంగళవారం పుంజుకుంది.  గిరాకీ బాగుండటంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి.  మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్​)లో మార్చి నెల డెలివరీ వెండి కాంట్రాక్టు రూ.29,372 (12.43 శాతం ) పెరిగి, కిలో  ధర రూ.2,65,633 వద్ద ట్రేడ్ అయింది. ఒక దశలో రూ.2,70,398 గరిష్ట స్థాయిని కూడా తాకింది. ఈ నెల 29న రూ.4.20 లక్షల వద్ద జీవితకాల గరిష్టాన్ని చూసిన వెండి, ఆ తర్వాత రెండు రోజుల్లోనే 41 శాతం పడిపోయింది. బంగారం ఫ్యూచర్స్ కూడా 5.5 శాతం పెరిగాయి. ఏప్రిల్ కాంట్రాక్టు రూ.7,923 పెరిగి, 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,914 వద్ద ట్రేడ్ అవుతోంది. గత మూడు సెషన్లలో బంగారం ధర దాదాపు రూ.40 వేలు (22 శాతం) పతనమైంది.