- ఇన్వెస్టర్లకు రూ.12 లక్షల కోట్ల నష్టం
- క్రూడ్ ధరలు పెరగడం, ఫెడ్ వైఖరితో మార్కెట్ ఢమాల్
- బ్యాంక్ షేర్లను కిందకి లాగిన హెచ్‌డీఎఫ్‌సీ
పెరుగుతున్న ఆయిల్ ధరలు, ఫెడ్ రేట్లు తగ్గించకపోవడం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీనామా చేయడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు గురువారం 3 శాతానికి పైగా పడ్డాయి. గత మూడు సెషన్లలో వచ్చిన లాభాలను బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు కేవలం ఒక్క సెషన్‌లోనే కోల్పోయాయి. ఇన్వెస్టర్లు ఏకంగా రూ.12 లక్షల కోట్లు నష్టపోయారు. బేర్స్ దెబ్బకు సెన్సెక్స్ 2,497 పాయింట్లు నష్టపోయింది. 2024 జూన్ తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్ డే లాస్.
ముంబై:
ఒకవైపు పెరుగుతున్న ఆయిల్ ధరలు.. మరోవైపు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోవడం.. వీటికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాన్– ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీనామా.. వీటి దెబ్బకు ఇండియన్ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. బేర్స్ ఆధిపత్యం కొనసాగడంతో మూడుశాతానికి పైగా పడ్డాయి. గత మూడు సెషన్లలో వచ్చిన లాభాలను ఒక్క సెషన్‌లోనే కోల్పోయాయి. ఇన్వెస్టర్లు ఏకంగా రూ.12లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ గురువారం 3.26 శాతం లేదా 2,497 పాయింట్లు నష్టపోయి 74,207.24 వద్ద ముగిసింది. 2024 జూన్ తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్ డే లాస్! ఇంట్రాడేలో 2,753 పాయింట్లు (3.58 శాతం) తగ్గి 73,951 కి చేరింది. నిఫ్టీ కూడా 775 పాయింట్లు కోల్పోయి 23,002 వద్ద సెటిలయ్యింది.
మొత్తం 16 సెక్టోరల్ ఇండెక్స్‌లు రెడ్‌లో ముగియగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రభావంతో ఫైనాన్షియల్, బ్యాంకింగ్ ఇండెక్స్‌లు మూడు శాతం వరకు తగ్గాయి. బ్రాడర్ మార్కెట్‌లో కూడా ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్–100, నిఫ్టీ మిడ్‌క్యాప్–100 ఇండెక్స్‌లు 2 శాతం చొప్పున పడ్డాయి. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ 5 శాతం పైగా పడగా, ఒక్క ఓఎన్‌జీసీ మాత్రమే గ్రీన్‌లో ముగిసింది. ఐఓసీఎల్ 3.70 శాతం, హెచ్‌పీసీఎల్ షేర్లు 7.40 శాతం, బీపీసీఎల్ 6 శాతం పడ్డాయి.
ఇంత నష్టం ఎందుకంటే..
క్రూడ్ ధరలు భారీగా పెరగడం..
ఖతర్, యూఏఈ, సౌదీ అరేబియాకి చెందిన ఆయిల్, గ్యాస్ ఫీల్డ్స్‌పై ఇరాన్ దాడులు చేస్తుండడంతో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 10 శాతం పెరిగి బ్యారెల్‌కు 119 డాలర్లను టచ్ చేసింది. చివరికి 112 డాలర్లకు తగ్గింది. బ్రెంట్ ధర 110 డాలర్ల పైన ఎక్కువ కాలం కదిలితే భారతదేశం వంటి ఆయిల్ దిగుమతి దేశాలు నష్టపోతాయి. ఇండియాలో ద్రవ్యోల్బణం పెరిగి, వినియోగం తగ్గిపోతుంది. ఆయిల్ దిగుమతుల ఖర్చు ఎక్కువవుతుంది. ఫలితంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. దీంతో ఇండియా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగిస్తుంది.
ఇతర దేశాల మార్కెట్లూ వీక్
గ్లోబల్ మార్కెట్లు గురువారం బలహీనంగా ఉన్నాయి. జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మార్చకుండా 0.75 శాతం దగ్గర ఉంచింది. పెరుగుతున్న ఆయిల్ ధరల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. దీంతో జపాన్ నిక్కీ225 ఇండెక్స్ 3.38 శాతం పడింది. కొరియా కొస్పీ 2.73 శాతం, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.39 శాతం, హాంకాంగ్ హంగ్ సెంగ్ 2.02 శాతం పడ్డాయి. జర్మనీ డాక్స్ 3 శాతం, యూకే ఎఫ్‌టీఎస్‌ఈ 100 ఇండెక్స్ 2.97 శాతం, ఫ్రాన్స్ సీఏసీ40 ఇండెక్స్ 2.34 శాతం క్రాష్ అయ్యాయి. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు నష్టాల్లో కదిలాయి.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు..
ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఇండియా నుంచి ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రతి రోజు కొన్ని వేల కోట్ల రూపాయిల విలువైన షేర్లను అమ్మేస్తున్నారు. బుధవారం సెషన్‌లో నికరంగా రూ.2,714 కోట్ల షేర్లను అమ్మిన వీరు, గురువారం మరో రూ.7,558 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ.56,883 కోట్లను మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. అత్యధికంగా మార్చి 13న రూ.10,713 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు.
ఫెడ్ ఎఫెక్ట్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినా, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో ఒక్కసారి మాత్రమే రేట్ల కోత ఉంటుందనే సంకేతాలు ఇచ్చింది. యుద్ధం వలన అనిశ్చితి పెరిగిందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యూఎస్‌లో కీలక వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 3.75 శాతం రేంజ్‌లో ఉంది. యూఎస్ 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్ 4.23 శాతం వద్ద కదులుతోంది. ఎక్కువ వడ్డీ వస్తుండడం, ఎమర్జింగ్ మార్కెట్ల కంటే సేఫ్ కావడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి అమెరికాకు షిఫ్ట్ అవుతున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రాష్
ఇండెక్స్ హెవీ వెయిట్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు గురువారం 9 శాతం వరకు పడ్డాయి. బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అతాను చక్రవర్తి సడెన్‌గా రాజీనామా చేయడంతో 5.11 శాతం నష్టంతో సెషన్‌ను ముగించాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లు 3 శాతానికి పైగా పడ్డాయి.
యుద్ధం వల్ల రూ.34 లక్షల కోట్లు లాస్
ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్కెట్ పడుతోంది. మధ్యలో కొంత రికవరీ అయినా, అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇరాన్, అమెరికా యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరి 28న మొదలైంది. అప్పటి నుంచి మార్చి 19 మధ్య నిఫ్టీ 9 శాతం నష్టపోయింది. 25,500 స్థాయి నుంచి 23,002 కి పడింది. ఇన్వెస్టర్ల సంపద రూ.34 లక్షల కోట్లు ఆవిరైంది.
n మార్చి 2 న సెన్సెక్స్ 2,743 పాయింట్లు తగ్గగా, నిఫ్టీ 533 పాయింట్లు పడింది. ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లు నష్టపోయారు.
n మార్చి 9న నిఫ్టీ 696 పాయింట్లు
(3 శాతం) పడింది.
n మార్చి 4న సెన్సెక్స్ 1,122 పాయింట్లు (1.2 శాతం), నిఫ్టీ 385 పాయింట్లు తగ్గాయి.
నిఫ్టీలో ఎక్కువగా పడినవి
కంపెనీ పతనం (శాతాల్లో)
శ్రీరామ్ ఫైనాన్స్ 6.71
ఎటర్నల్ 5.38
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5.11
బజాజ్ ఫైనాన్స్ 4.93
ఎం అండ్ ఎం 4.82
రూపాయి@ 92.89
డాలర్‌తో రూపాయి 49 పైసలు క్షీణించి 92.89 వద్ద మరో జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఎఫ్‌ఐఐలు వెళ్లిపోతుండడం, క్రూడ్ ధరలు పెరగడంతో గత నెల రోజుల్లో రూపాయి విలువ 1.77 శాతం తగ్గింది.
