పోలీస్ కస్టడీలోని 2 టన్నుల గంజాయిని ఎలుకలు తినేశాయి..!

పోలీస్ కస్టడీలోని 2 టన్నుల గంజాయిని ఎలుకలు తినేశాయి..!

పోలీసుల తనిఖీల్లో గంజాయి, డ్రగ్స్ పట్టుబడటంపై తరచూ వార్తలు వింటుంటాం..ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి, డ్రగ్స్ ని సీజ్ చేసి ప్రభుత్వ గొడౌన్లలో నిల్వ చేయడం రొటీన్ ప్రాసెస్. అయితే.. గోడౌన్లో స్టోర్ చేసిన టన్నుల కొద్దీ గంజాయి మాయమవ్వడం.. అందులోనూ  ఎలుకలు టన్నుల కొద్దీ గంజాయి తినేయడం ఎప్పుడైనా విన్నారా...? వినలేదు కదా... గుజరాత్ లో జరిగింది ఈ వింత ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

ఇటీవల గుజరాత్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్ట్ లో సంచలన విషయం బయటపడింది. అధికారుల సీజ్ చేసిన రెండు టన్నుల గంజాయి ఎలుకలు తినేశాయంటూ కాగ్ రిపోర్ట్ లో వెల్లడించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 2022 అక్టోబర్ నుండి 2023 జులై వరకు సీజ్ చేసిన 6 వేల 510 కిలోల మాదక ద్రవ్యాల స్టాక్ లో 4 వేల 177 కిలోల మాదకద్రవ్యాల స్టాక్ ను ధ్వంసం చేసినట్లు తెలిపారు అధికారులు. అయితే.. మిగిలిన 2 వేల 332 కిలోల సరుకు అదృశ్యమైనట్లు పేర్కొన్నారు అధికారులు.

ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ అదృశ్యమవ్వడంపై విచారణ చేపట్టారు అధికారులు. అధికారుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 144 కిలోల గంజాయి దొంగలించబడిందని.. నిల్వ చేసేందుకు సరైన సదుపాయం లేకపోవడం వల్ల భారీ మొత్తంలో గంజాయి, నల్ల మందు ఎలుకలు తినేశాయని పేర్కొన్నారు అధికారులు. అంతే కాకుండా.. పచ్చి గంజాయి రోజులు గడిచేకొద్దీ తేమను కోల్పోయి..ఎండిపోవడం వల్ల కూడా కొంత బరువు తగ్గుతుందని తెలిపారు అధికారులు.

అయితే.. అధికారుల వివరణతో అసంతృప్తి వ్యక్తం చేసిన కాగ్.. ఇంత భారీ మొత్తంలో సరుకు మాయమవ్వడంపై ఆగ్రహం వ్యక్తం  చేసింది. 2 వేల 300 కిలోల మాదకద్రవ్యాలు అదృశ్యం అవ్వడానికి ఎలుకలు, తేమ కారణమంటూ వివరణ ఇస్తే సరిపోదని..ఇది పాలనా, భద్రతా వైఫల్యమని పేర్కొంది కాగ్.

ALSO READ : హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ వీరంగం.. స్థానికులపై కత్తులతో దాడి.. ఇంటిపై పెట్రోల్ పోసి..

అదృశ్యమైన సరుకుల్లో కనీసం కొంత మొత్తమైనా తిరిగి అక్రమ చలామణిలోకి మళ్ళించబడి ఉండచ్చని ఆందోళన వ్యక్తం చేసింది కాగ్. పటిష్టమైన స్టోరేజ్ సదుపాయాలు, మెరుగైన ఫోరెన్సిక్ నిర్వహణ, సాక్ష్యాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ సహా తక్షణమే చర్యలు తీసుకోవాలని హోమ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది కాగ్.