పడిగె రాయిపై ప్రాచీన రాతి చిత్రాలు

పడిగె రాయిపై ప్రాచీన రాతి చిత్రాలు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్​శివారులో గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని బుర్కగుట్ట పడిగె రాయిపై రాక్ ఆర్ట్స్ ను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు అల్లె రమేశ్ గుర్తించారు.ఇక్కడ కనిపించే బల్లి, ఆంత్రోపొమోర్ఫిక్ చిత్రాలు ఖమ్మం జిల్లాలోని ఒంటిగుండులో కనిపించిన చిత్రాలతో పోల్చదగినవని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. 


అలాగే తేలు, కింది రెండు వృత్తాలు, త్రిభుజాకారాలు, చేతులు పైకెత్తిన మనిషి రూపం కనిపిస్తున్నది. ఆరు అవయవాలతో పాదం నమూనా, రెండు కుక్కలు, కొన్ని రంగుపోయి గుర్తించే వీలుకాని చిత్రాలు ఉన్నాయని హరగోపాల్ వివరించారు. నరసింహస్వామి క్షేత్రంగా కొలిచే భక్తులు ఈ రాతి చిత్రాలను గమనించకుండా సున్నం వేయడం వల్ల ఎన్నో విలువైన రాతి చిత్రాలు కనిపించకుండాపోయాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలు పెద్ద రాతి యుగానికి (మెగాథిలిక్) చెందినవిగా చరిత్ర బృందం సలహాదారుడు, రాక్ ఆర్ట్స్ నిపుణుడు బండి మురళీధర్ రెడ్డి తెలిపారు.