మహబూబ్‌నగర్, వెలుగు: మహబూబ్‌నగర్‌లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇండ్లపై అర్ధరాత్రి దుండగులు కొందరు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి 11 గంటల టైమ్‌లో కొందరు దుండగులు జితేందర్‌రెడ్డి ఇంటిపై రాళ్లు విసురుతూ, మెయిన్‌గేటు వద్ద కారు టైర్లు వేసి నిప్పుపెట్టారు. జితేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంట్లో ఉన్న జితేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు సురేందర్‌రెడ్డి ఇది గమనించి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. సుమారు పదిమంది వరకు ఉన్న దుండగులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తల ఇతర శరీర భాగాల్లో గాయాలై తీవ్ర రక్తస్రావం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకొని దుండగులను తరిమేశారు. గాయపడిన సురేందర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి డీకే అరుణ ఇంటికి వెళ్లిన దుండగులు ఆమె ఇంటిపై రాళ్లు విసిరారు. ఇంట్లో ఉన్న వాచ్‌మన్ సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకున్న పోలీసులు వారిని తరిమేశారు.
