
హైదరాబాద్, వెలుగు: సమాచార శాఖలో ఓ ఆంధ్రా అధికారికి అక్రమంగా ప్రమోషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని, దానిని ఆపాలని సీఎస్ శాంతి కుమారికి ఆ శాఖ ఉద్యోగులు, అధికారులు ఇటీవల వినతిపత్రం అందజేశారు. ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్న ఓ ఏపీ అధికారి ఆ పోస్టుకు అనర్హుడని, ఆయనకు జర్నలిజం విద్యార్హతలు లేవని.. అక్రమ పద్ధతుల్లో పదోన్నతికి ప్రయత్నం చేస్తున్నారని ఆమెకు తెలిపారు. జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న తెలంగాణ అధికారికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆయనకు దక్కకుండా ఏపీ అధికారి తప్పుడు మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారని సీఎస్ కు వివరించారు. గత ప్రభుత్వంలో కొందరి అండతో రూల్స్‌కు విరుద్ధంగా ఆ ఏపీ అధికారి ఇదివరకు పొందిన పదోన్నతులు సమీక్షించి రివర్షన్ చేయాలని కోరుతున్నారు.