వాట్సాప్‌లో ఈ పది తప్పులు చేయొద్దు: జైలుకు వెళ్లాల్సిన..

వాట్సాప్‌లో ఈ పది తప్పులు చేయొద్దు: జైలుకు వెళ్లాల్సిన..

సోషల్ మీడియాలో తెలిసీ తెలియక  చేసే కొన్ని రకాల తప్పుల వల్ల యూజర్లు సమస్యల్లో పడుతున్నారు. పోలీసు కేసుల్లోనూ ఇరుక్కుంటున్నారు. తొలుత పర్సనల్ మెసేజింగ్ యాప్‌గా మొదలైన వాట్సాప్.. టెక్నాలజీ పెరిగే కొద్దీ అది కూడా ఓ సెమీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లా మారిపోయింది. వందల కొద్దీ మెంబర్లతో వాట్సాప్ గ్రూపులు, ఫొటోలు, వీడియోలతో స్టేటస్‌లు, వాటిని ఫేస్‌బుక్‌లోనూ షేర్ చేసే వీలు, గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్ కూడా చేసుకునే అవకాశం లాంటి ఫీచర్లు ఎన్నో వచ్చాయి. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన తీరులోనే స్టేటస్‌ల ద్వారా పర్సనల్ సమాచారాన్ని, ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు జనం. అలాగే ఎక్కడో ఎవరో క్రియేట్ చేసిన ఫార్వర్డ్ మెసేజ్‌లను ఒకరి నుంచి మరొకరు షేర్ చేసుకుంటూ పుకార్ల వ్యాప్తికి కారణమవుతున్నారు. ఇలా రకరకాలుగా వాట్సాప్ వాడకంతో కొందరు యూజర్స్ పర్సనల్ డేటా బయటకి పోవడంతో పాటు సైబర్ చట్టాల ఉల్లంఘించి కష్టాల్లో పడుతున్నారు. సమస్యలను కొని తెచ్చుకోకుండా ఉండాలంటే వాట్సాప్‌లో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడితే మంచిది.

అవసరం లేని నంబర్ల విషయంలో…

ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరూ మీ వాట్సాప్ ప్రొఫైల్‌ను చూసే అవకాశం ఇవ్వొద్దు. ఫోన్‌లో నంబర్ సేవ్ అయిన ప్రతి ఒక్కరూ మనకు వాట్సాప్ అకౌంట్ ఉన్నట్లు చూడగలరు. ఎప్పుడో ఒకసారి అవసరమైనప్పుడు సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ డిలీట్ చేయకుండా అలానే ఉంచితే వాళ్లు మీ ఫొటోలు, స్టేటస్‌లు చూసి.. మిస్ యూజ్ చేసే అవకాశం ఉంది. పర్సనల్ డేటా దుర్వినియోగం కాకుండా చూసుకునేందుకు అసవరం లేని నంబర్లను డిలీట్ చేయొచ్చు. లేదా కనీసం వాట్సాప్‌ వరకైనా వారి నంబర్లను బ్లాక్ చేయొచ్చు. ఉదాహరణకు ఎప్పుడో ఇంట్లో పని మనిషిగా ఉండి ఏదో తప్పు చేస్తే పనిలో నుంచి తీసేసిన వాళ్ల నంబర్లు ఫోన్లో ఉండడం అంత మంచిది కాదు.

ప్రొఫైల్ ఫొటో హైడ్ చేసే ఆప్షన్ లేదు.. ఏం చేస్తే మేలు?

వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను మీకు ఇష్టం లేని వారికి మాత్రమే కనపడకుండా హైడ్ చేసే ఆప్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం వాట్సాప్ ఫొటో ఎవరు చూడాలన్న దానిపై రెండే ఆప్షన్స్ ఉన్నాయి.  ఒకటి మై కాంటాక్స్, రెండు నోబడీ. కాబట్టి వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో మీ గురించి ఎక్కువ సమాచారం రివీల్ కాకుండా చూసుకోవడం మేలు. కుటుంబసభ్యులు, చిన్నపిల్లలు కనిపించకుండా చూసుకోవాలి. లేకుంటే కొన్ని సందర్భాల్లో క్రైమ్ చేసే వాళ్లకు మన కుటుంబసభ్యుల ఫొటోలను మనమే అందుబాటులో పెట్టినట్లుగా అవుతుంది.

టూ స్టెప్ వెరిఫికేషన్ పిన్..

వాట్సాప్‌ ప్రొటెక్షన్‌కు ఉన్న బెస్ట్ ఆప్షన్ టూ స్టెప్ వెరిఫికేషన్ పిన్. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆరు అంకెల సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవడం ద్వారా ఇతరులు యాప్ ఓపెన్ చేసే వీలు లేకుండా చేయొచ్చు. అలాగే ఓటీపీ ద్వారా మీ నంబర్‌తో మరొకరు వాట్సాప్ అకౌంట్‌ను తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని వాడకుండా అడ్డుకోవచ్చు.

వాట్సాప్ స్టేటస్‌ విషయంలో..

వాట్సాప్ స్టేటస్‌ల ప్రైవసీ విషయంలోనూ యూజర్లు జాగ్రత వహించాలి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మాత్రమే చూడగలిగేలా పెట్టుకోవడం మేలు. ఇతరులు ఆ స్టేటస్‌ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు చూడకుండా ప్రైవసీ సెట్టింగ్స్‌ మార్చుకోవాలి.

వాట్సాప్ గ్రూపులు

ఎవరుపడితే వారు మిమ్మల్ని వారి వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేయకుండా అడ్డుకునే వీలు ఉంటుంది. దీని ద్వారా పెద్దగా పరిచయం లేని వాళ్ల గ్రూప్‌ చాట్‌కు దూరంగా ఉండొచ్చు. అందులో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్‌లు, పుకార్లు, ఫేక్ న్యూస్‌ మీ దాకా చేరకుండా చూసుకోవచ్చు.

వాట్సాప్‌లో వచ్చే ఫొటోలు, వీడియోలు..

వాట్సాప్‌లో వచ్చే ఫొటోలు, వీడియోలు అన్ని డీఫాల్ట్‌గా ఫోన్ గ్యాలరీలో సేవ్ కాకుండా చూసుకోవడం మేలు. సిల్లీ గుడ్ మార్నింగ్ మెసేజ్, ఇతర ఫార్వర్డ్ మెసేజ్ ఫొటోలు కూడా నేరుగా డౌన్‌లోడ్ కావడంతో డేటా వేస్టేజ్‌తో పాటు  ఫోన్ మెమొరీ కూడా నిండిపోతుంది.

బ్యాకప్

వాట్సాప్ చాట్స్ ఆటో బ్యాకప్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు. అవసరమైన చాట్స్ మాత్రమే సేవ్ చేసుకుంటే సరిపోతుంది. గూగుల్ డ్రైవ్, ఐ క్లౌడ్‌లోకి అన్ని చాట్స్, ఫొటోలు, వీడియోలు ఎక్స్‌పోర్ట్ చేసుకోవడం వల్ల బ్యాకప్ స్పేస్ లిమిట్ అనవసరంగా నిండిపోతుంది. అలాగే  బ్యాకప్ లింక్ పొరబాటున షేర్ చేస్తే ఇతరులు మీ పర్సనల్ మెసేజ్‌లు చూసే చాన్స్ ఉంది.

ఇలాంటివి షేర్ చేసి చిక్కుల్లో పడొద్దు

పోర్న్ క్లిప్స్, అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌లో షేర్ చేయడం మంచిది కాదు. బాలికలపై జరిగే క్రైమ్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా గ్రూపుల్లో షేర్ చేసి వైరల్ చేయడం లాంటివి చేయకూడదు. వీటి వల్ల జైలు పాలయ్యే ప్రమాదం ఉంది.

ఫేక్ న్యూస్  విషయంలో..

ఫేక్ న్యూస్, మత పరమైన సెన్సిటివ్ విషయాలను, అల్లర్లకు సంబంధించిన వార్తలు, వీడియోలను షేర్ చేయడం చట్ట వ్యతిరేకం. ఇలాంటివి షేర్ చేస్తే సైబర్ చట్టాల ప్రకారం కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో మీరు షేర్ చేయకున్నా.. అందులోని మెంబర్లు పోస్ట్ చేసిన మెసేజ్‌లకు కూడా మీరు అడ్మిన్‌గా ఉంటే బాధ్యత వహించాల్సి వస్తుంది. మెసేజ్ షేర్ చేసిన వారితో పాటు అడ్మిన్ పైనా కేసులు తప్పవు.

ఇతరుల పేరు వాడొద్దు

వాట్సాప్ అకౌంట్‌ను ఇతరుల పేరుతో వాడడం కూడా నేరమే. వేరొకరి పేరు, ఫొటోలతో అకౌంట్‌ను వాడుతూ మెసేజ్‌లు షేర్ చేస్తే జైలు పాలవ్వాల్సి వస్తుంది.