శ్రీశైలం నుంచి సాగర్‌‌కు నీటి విడుదల ఆపాలె

 శ్రీశైలం నుంచి సాగర్‌‌కు నీటి విడుదల ఆపాలె
  • కృష్ణా బోర్డుకు ఏపీ లెటర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్‌‌ నుంచి లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ ద్వారా నాగార్జునసాగర్‌‌కు నీటి విడుదలను ఆపాలని కృష్ణా బోర్డును ఏపీ కోరింది. ఈ మేరకు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి శుక్రవారం కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురే బోర్డుకు లెటర్‌‌ రాశారు. తెలంగాణ ప్రభుత్వం 1996లో జారీ చేసిన జీవో నం.69ని అతిక్రమించి లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ ద్వారా సాగర్‌‌కు నీటిని విడుదల చేస్తోందని, వెంటనే నీటి విడుదల ఆపేలా తెలంగాణను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌‌లో 885 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ను ఆపరేట్‌‌ చేయాల్సి ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్‌‌లో నీటి మట్టం 854 అడుగులకు దిగువకు పడిపోయినా నీటి విడుదల మాత్రం ఆపట్లేదన్నారు. శ్రీశైలం ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్‌‌ను 50 %చొప్పున వినియోగించుకునేలా అగ్రిమెంట్‌‌ చేసుకున్నప్పటికీ.. దానిని తెలంగాణ అతిక్రమిస్తోందని లేఖలో పేర్కొన్నారు.