నో టెస్ట్.. నో బెడ్ నో వ్యాక్సిన్

నో టెస్ట్.. నో బెడ్ నో వ్యాక్సిన్

కిట్ల కొరతతో తగ్గిన టెస్టులు.. 
గవర్నమెంట్, ప్రైవేట్ 
దవాఖాన్లలో బెడ్లన్నీ ఫుల్ 
చాలాచోట్ల ‘నో కొవిడ్ టెస్ట్, 
నో వ్యాక్సినేషన్’ అంటూ బోర్డులు

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సరిపడా కిట్లు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు టీకా డోసులు లేకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రాసెస్ కు అంతరాయం కలుగుతోంది. ఇంకోవైపు గవర్నమెంట్, ప్రైవేట్ దవాఖాన్లలో బెడ్ కూడా దొరకని దుస్థితి నెలకొంది. రాష్ర్టవ్యాప్తంగా గురువారం వ్యాక్సినేషన్ ఆగిపోయింది. చాలా తక్కువ సెంటర్లలో మాత్రమే టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ ఉండదని కొన్ని జిల్లాల్లో ముందే ప్రకటించినా, కొన్ని చోట్ల మాత్రం చెప్పలేదు.

దీంతో సెంటర్లకు వచ్చిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఇబ్బందులు పడ్డారు. కాగా, కేంద్ర ప్రభుత్వం పంపించిన 3 లక్షల కొవిషీల్డ్ డోసులు మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వెంటనే వాటిని జిల్లాలకు పంపారు. శుక్ర, శనివారాలకు ఈ డోసులు సరిపోతాయని.. ఈ రెండ్రోజుల్లో వ్యాక్సినేషన్ యథావిధిగా కొనసాగుతుందని హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. మరో లక్షన్నర డోసులను కూడా మన రాష్ట్రానికి పంపిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.  
టెస్టుల కోసం జనం క్యూ.. 
కరోనా టెస్టుల కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 4 గంటలకే టెస్టింగ్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. గురువారం హైదరాబాద్​లోని బాలానగర్ పీహెచ్ సీలో ఉదయం 11 గంటలైనా టెస్టులు ప్రారంభించలేదు. దీంతో బాధితులు మండిపడ్డారు. గంటల తరబడి లైన్‌లో నిల్చున్నాక.. ‘కిట్లు లేవు.. రేపు రండి’ అంటూ హెల్త్ స్టాఫ్ తిప్పి పంపుతున్నారు. అవసరమైనన్ని కిట్లను కొని పెట్టుకోవడంలో విఫలమైన సర్కార్‌.. ఆ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకునేందుకు సాకులు చెబుతోంది. సింప్టమ్స్‌ లేనోళ్లకు టెస్టులు అక్కర్లేదని, సింప్టమ్స్ ఉన్నోళ్లకే టెస్టులు చేస్తామని ప్రకటించింది. కానీ, సెంటర్ల వద్దకు పోతే సింప్టమ్స్ ఉన్నోళ్లకు కూడా టెస్టులు చేస్తలేరు. టెస్టింగ్ సెంటర్ల దగ్గరే నిరీక్షించి జనాలు నీరిసించి పోతున్నారు. కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కిట్ల కొరతతో టెస్టుల సంఖ్య తగ్గుతోంది. మంగళవారం 82,270 మందికి టెస్టులు చేయగా, బుధవారం 80,181 మందికి చేశారు. గవర్నమెంట్ టెస్టులు చేయకపోవడంతో.. ప్రైవేల్ ల్యాబ్​లు టెస్టుల ధరలు పెంచి, ప్రజలను దోచుకుంటున్నాయి. 
వీఐపీలకూ బెడ్లు లేవ్..     
కరోనా బాధితులకు ఆస్పత్రిలో బెడ్డు దొరకడమే కష్టమవుతోంది. కార్పొరేట్‌, ప్రైవేట్ దవాఖాన్లన్నీ ఫుల్ అయ్యాయి. గాంధీ, టిమ్స్‌, కింగ్ కోఠి, చెస్ట్‌ హాస్పిటల్‌, జిల్లా హాస్పిటళ్లు పేషెంట్లతో నిండిపోయాయి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వీఐపీలు, వీవీఐపీలు కూడా తమకు ఒక బెడ్డు ఇప్పించండంటూ హెల్త్ ఆఫీసర్లను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కలిపి ప్రస్తుతం 22,608 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. 6,818 ఆక్సిజన్ బెడ్లు, 3,316 వెంటిలేటర్‌‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయని సర్కార్ చెబుతోంది. కానీ, అసలు ఎక్కడా బెడ్లు ఖాళీ లేవు. టైమ్ కు బెడ్డు దొరక్క బాధితులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. 
టెస్టులు బంద్ అంటూ బోర్డులు..  
వరంగల్ అర్బన్ జిల్లాలో కిట్ల కొరతతో టెస్టులు, వ్యాక్సిన్ కొరతతో వ్యాక్సినేషన్ నిలిపివేశారు. జిల్లాలో ఇప్పటి వరకు పీహెచ్ సీలు, వెల్ నెస్ సెంటర్లన్నీ కలిపి 37 కేంద్రాల్లో టెస్టులు చేయగా.. ఇప్పుడు చాలా సెంటర్లలో టెస్టులు చేయడం లేదు. ‘‘కిట్లు లేవు.. టెస్టులు చేస్తలేం” అని బోర్డులు పెట్టారు. కాగా, ఇప్పటి వరకు జిల్లాలో 58 సెంటర్లలో టీకాలు వేయగా.. గురువారం కేవలం నాలుగు సెంటర్లలోనే వేశారు. మిగిలిన సెంటర్లలో స్టాక్ లేదని బోర్డులు పెట్టారు. దీంతో వ్యాక్సిన్ కోసం వచ్చిన చాలామంది తిరిగి వెళ్లిపోయారు.