వాట్సాప్​ కొత్త ప్రైవసీ పాలసీని ఆపండి

వాట్సాప్​ కొత్త ప్రైవసీ పాలసీని ఆపండి
  • ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ 
  • వాట్సాప్ పాలసీ ఐటీ రూల్స్ కు విరుద్ధమని స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ, టర్మ్స్ ఆఫ్​సర్వీస్ మే 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని, అయితే అవి ఐటీ రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయని కేంద్రం విన్నవించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్ ను సవాల్ చేస్తూ సీమా సింగ్, మేఘన్, విక్రమ్ సింగ్ అనే వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్​ను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్ ఆధ్వర్యంలోని బెంచ్ శుక్రవారం విచారించింది. 
 

ఐటీ రూల్స్ కు విరుద్ధం.. 
వాట్సాప్ కొత్త పాలసీ ప్రకారం యూజర్లు దానిని అంగీకరించొచ్చు లేదా యాప్ నుంచి ఎగ్జిట్ కావొ చ్చు. కానీ యూజర్లు తమ డాటాను ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని యాప్​లు లేదా థర్డ్ పార్టీ యాప్​లతో షేర్ చేయవద్దని ఆప్షన్ ఎంపిక చేసుకునేందుకు అవకాశంలేదు. దీంతో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల ఇండియన్ డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ చట్టాల్లో ఉన్న లొసుగులు బయటపడ్డాయని పిటిషనర్లు పేర్కొన్నారు. యూజర్ల డాటా ప్రొటెక్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రూపొందించేలా ఆదేశించాలంటూ కోరారు. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ కోసం పకడ్బందీ చర్యలను తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించినట్లు అఫిడవిట్​లో తెలిపింది.