సింగరేణిపై మీ కుట్రలు ఆపండి : కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌‌

సింగరేణిపై మీ కుట్రలు ఆపండి : కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌‌

బొగ్గు గనుల వేలం అంటే సింగరేణికి తాళం వేయడమేనని కామెంట్​

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ ఆయువు పట్టు సింగరేణిని ప్రైవేటుపరం కుట్రలను వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తక్కువ కాలంలోనే అద్భుతమైన ప్రగతి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి, కుట్రలు చేస్తోందని గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు వేలం వేస్తున్నట్టు ప్రకటించడంపై కేటీఆర్‌‌ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ అనేకసార్లు వ్యాఖ్యానించారని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దెబ్బకొట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఫైర్‌‌ అయ్యారు. గుజరాత్‌లో లిగ్నైట్‌ గనులను ఆ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టి, ఇక్కడ మాత్రం సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌ మాదిరిగానే తెలంగాణలో బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 

రాష్ట్రంపై ప్రధానికి జెలసీ..

తెలంగాణపై ప్రధాని మోడీ జెలసీతో ఉన్నారని, అందుకే బొగ్గు బ్లాకుల వేలానికి ప్రయత్నిస్తున్నారని, ఈ పక్షపాతం ఇంకా ఎన్ని రోజులని కేటీఆర్‌‌ ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయబోమని మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు చెప్పారని, కానీ, ఇప్పుడు బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టడం వారి అవన్నీ అబద్ధాలేనని అర్థం అవుతోందన్నారు. బొగ్గు బావుల వేలం అంటే, సింగరేణికి తాళం వేయడమేనన్నారు. సింగరేణి ప్రైవేట్‌పరం చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.