
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రంలో వాన తెంపు లేకుంట పడతంది. శుక్ర, శనివారాల్లో పడ్డ వానలతో పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే మెదక్ మండలం పాతూర్లో అత్యధికంగా 26.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో మెదక్జిల్లాలోని హల్దీవాగు, పుష్పాలవాగు, పసుపులేరు వాగు, గుండువాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సుమారు 226 ఇండ్లు కూలిపోయాయి. ఐదు చోట్ల లోలెవల్కాజ్ వేల బ్రిడ్జిలు కూలి రాకపోకలు స్తంభించాయి. మెదక్ పట్టణంలో మహబూబ్ నహర్కాలువ పొంగడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. రామాయంపేటలో తహసీల్దార్ ఆఫీస్, గర్ల్స్ హాస్టల్ లోకి భారీగా నీరు చేరింది. సిద్దిపేటలో 11 ఇండ్లు కూలిపోయాయి. మోయ తుమ్మెద వాగు పొంగిపొర్లడంతో సిద్దిపేట– -హన్మకొండ రూట్లో, కూడెళ్లివాగు ఉధృతంగా ప్రవహించడంతో మిరుదొడ్డి–అల్వాల మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లాలో నిలిచిన రాకపోకలు
ములుగు జిల్లాలోని163 ఎన్హెచ్ లో వట్టివాగు వద్ద ఉన్న కాజ్ వే పై నుంచి ఉధృతంగా వరదనీరు ప్రవహించడంతో రోడ్డు తెగి, రెయిలింగ్ ధ్వంసమైంది. వెంగళాపూర్సమీపంలోని బాంబుల ఒర్రె ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఫారెస్ట్ ఆఫీసర్లు పస్రా రేంజ్ పరిధిలోని అడవికి ట్రాక్టర్లో మొక్కలు తీసుకెళ్లి, తిరిగి పస్రాకు వస్తున్న క్రమంలో వరదలో ట్రాక్టర్ చిక్కుకుంది. వెంటనే మరో ట్రాక్టర్ తీసుకొచ్చి బయటకు తీసేందుకు ప్రయత్నించగా ఆ ట్రాక్టర్ కూడా వరదలో కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ముకుందపురం, కొత్తపల్లిమధ్య వాగులో చిక్కుకున్న 23 మంది వ్యవసాయ కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శనివారం కాపాడారు.