గాలివానతో అతలాకుతలం

గాలివానతో అతలాకుతలం

సోమవారం సాయంత్రం పలు జిల్లాల్లో గాలివాన అతలాకుతలం చేసింది. పిడుగు పడి ఒక బాలిక చనిపోగా ఇద్దరికి గాయాలయ్యాయి. తాటిచెట్టు పడిపోయి ఒక గీత కార్మికుడు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. చాలా చోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపడ్డాయి. చాలా చోట్ల విద్యుత్‌‌‌‌ వైర్లు తెగిపడి, గంటల తరబడి సరఫరా నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కోలంగూడకు చెందిన సిడం వనిత (15)  పిడుగు పడి చనిపొయింది.సిడం భీము కుటుంబ సభ్యులు కడెం వాగు దగ్గర తడకలు,గుల్లలు అల్లుతుంటారు. సోమవారం రాత్రి గాలివాన మొదలుకాగానే ఊరికి బయలుదేరేందుకు సిద్దమయ్యారు. ఇంతలోనే పిడుగు పడి వనిత చనిపోయింది. లక్ష్మణచంద మండలంలో పిడుగుపడి  బీహార్‌‌‌‌కు చెందిన యువకుడు రాజా తలకు తీవ్ర గాయాలు కాగా,  అతని స్నేహితుడు చాంద్‌‌‌‌కు కూడా గాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బీహార్‌‌‌‌ నుంచి ఉపాధి కోసం వచ్చిన రాజా లక్ష్మణచందాలో సైకిల్ రిపేర్ పనులు చేస్తుంటాడు. లక్ష్మణచందా రైస్ మిల్ దగ్గర మరో పిడుగు పడి బొజ్జ చినముత్తన్నకు చెందిన రెండు ఎడ్లు చనిపోయాయి.

మండలంలో గాలివాన వల్ల చాలా చోట్ల మామిడికాయలు రాలిపోయాయి. లక్ష్మణచాందలో ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ కూలిపోయింది. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పార్‌‌‌‌పెళ్లి గ్రామంలో పెద్దపెద్ద చెట్లు పడిపోయాయి. ఇండ్ల పైకప్పు కొట్టుకుపోయి ఓ కుటుంబం ఆశ్రయం కోల్పోయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలోని నిర్మల్, జన్నారం, ఖానాపూర్​, కడెం మండలాల్లో రెండు గంటల పాటు జోరు వాన పడింది. ఈదురు గాలులకు  పలు చోట్ల చెట్లు, ఇంటి పైకప్పు రేకులు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి.

గద్వాల జోగులాంబ జిల్లాలోని అలంపూర్​లో ఆదివారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బాలబ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణం పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది. మ్యూజియం ఎదుట ఉన్న భారీ వేప చెట్టు విరిగిపడింది. పట్టణంలో సుభాష్​చంద్రబోస్​ విగ్రహం కూలిపోయింది. మహబూబ్​నగర్ జిల్లా అంతటా సోమవారం సాయంత్రం వానలు పడ్డాయి.

నిజామాబాద్​నగరంతో పాటు బోధన్, ఇందల్వాయి, నవీపేట, కోటగిరి, కామారెడ్డి, లింగంపేటల్లో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలికి కరెంట్​స్తంభాలు, చెట్లు కూలిపోగా ఇండ్ల పైకప్పుగా ఉన్న రేకులు ఎగిరిపోయాయి. బోధన్​లో పరిషత్‌‌‌‌ ఎన్నికల కౌంటింగ్​ కోసం ఏర్పాటు చేసిన టెంట్​ఈదురు గాలులకు కూలిపోయింది. అలాగే బోధన్​పట్టణంలోని రాకాసిపేట్‌‌‌‌లో ఓ కారు మీద చెట్టు కూలిపడింది.

ఉమ్మడి మెదక్​జిల్లాఅంతటా ఉరుములు, మెరుపులతో పెద్ద వాన పడింది.  సంగారెడ్డి, పటాన్‌‌‌‌‌‌‌‌చెరు, సదాశివపేట, నారాయణఖేడ్‌‌‌‌‌‌‌‌, జహీరాబాద్‌‌‌‌ల‌‌‌‌లో గంటసేపు  భారీ వర్షం కురిసింది. దుబ్బాకలో కూడా జోరు వాన కురిసింది. మెదక్‌‌‌‌లోని  రాందాస్‌‌‌‌‌‌‌‌ చౌరస్తా, జేఎన్‌‌‌‌‌‌‌‌ రోడ్డు, ఎంజీ రోడ్డు జలమయమయ్యాయి. సిద్దిపేట జిల్లా రాయపోల్‌‌‌‌‌‌‌‌లో పిడుగుపడి రెండు కాడెద్దులు,  పెద్దశంకరంపేటలో పాడిగేడె చనిపోయాయి.

జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెంలో  పాతగోడ కూలి గొల్ల సత్తయ్య, యాదయ్యలకు చెందిన 15 గొర్రెలు చనిపోయాయి.  గజ్వేల్‌‌‌‌‌‌‌‌ మండలం బయ్యారంలో కోళ్లఫారం కూలిపోయింది.

యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో సోమవారం సాయంత్రం జోరుగా ఈదురు గాలులు వీచాయి. మోత్కూర్​మండలంలో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. కరెంట్​స్తంభాలు నేలకొరిగాయి. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో తాటి చెట్టు విరిగిపడి గీత కార్మికుడు అక్కడికక్కడి మృతి చెందాడు. అదే గ్రామంలో మరో గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. దమ్మపేట, అప్పారావుపేట, నల్లకుంట, బంజర, మల్కారం ప్రాంతాల్లో అరటి తోటలు నేలకొరిగాయి.