విశ్వాసం : దురాశ మంచిది కాదు

విశ్వాసం : దురాశ మంచిది కాదు

మనిషి ఆశతో జీవించాలి. నిరాశకు లోనైతే ఏ పనీ సాధించలేడు. దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి చెందాలి... ఇటువంటి వైరుధ్యం ఉన్న మాటలు తరచుగా వింటుంటాం. మనిషి నిష్కామంగా పనిచేయాలని భగవద్గీత చెప్తోంది. ఏదో ఆశించి పని చేయకూడదని శ్రీకృష్ణుడు బోధించాడు.కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన। మానవులుగా జీవించినంత కాలం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. కాని ఫలితాన్ని ఆశించకూడదని దాని అర్థం.అంటే ఏ పని చేసినా తృప్తిగా చేయాలి. అంతేకానీ ఏదో ఆశించి పని చేయకూడదని అంతరార్థం. అనవసరంగా ఆశపడితే దాని పరిణామాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి.దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకోవచ్చు.

ఒక ఊరిలో మరీచుడు అనే మహర్షి ఉన్నాడు. ఆయన తన విద్యార్థులకు మంచి విషయాలు బోధించేవాడు. ‘‘ఎన్నడూ అత్యాశకు పోరాదు, ఉన్నదానితో సంతృప్తి చెందాలి, పరులకు హాని చేయకూడదు. జీవితంలో ఆశ అనే అంశాన్ని విడిచిపెట్టకూడదు. ఆశ ఉన్నవారే జీవించగలరు’’ అంటూ పలు అంశాలను వారికి నేర్పాడు. ఆయన దగ్గర ఉన్న శిష్యులలో రామయ్య, సోమయ్య, చంద్రయ్య అనే ముగ్గురు శిష్యులు విద్య ముగించుకుని, గురువుగారి దగ్గర సెలవు పుచ్చుకుని ఇళ్లకు బయల్దేరారు. అప్పుడు ఆ గురువుగారు ముగ్గురికీ మూడు రాళ్లు ఇచ్చి, ‘‘మీరు ఈ రాళ్లను మీ చేతిలో ఉంచుకోండి. మీ ఇళ్లకు నడుస్తూ వెళుతుండగా, దారిలో ఆ రాయి దానంతట అది ఎక్కడ పడిపోతే అక్కడ తవ్వి, ఏది లభిస్తే అది తీసుకుని సంతృప్తిగా వెళ్లండి’’ అని చెప్పాడు. ‘అలాగే గురువుగారూ!’ అని చెప్పి వారు ముగ్గురూ బయల్దేరారు. దారి మధ్యలో ఉండగా వారిలో వారు, ‘అసలు చేతిలో రాయి ఎలా పడిపోతుంది’ అని చర్చించుకుంటుండగా, వారిలో రామయ్య చేతిలో రాయి కింద పడిపోయింది. గురువుగారి మాట ప్రకారం అక్కడ బాగా లోతుగా తవ్వారు. కావలసినంత వెండి దొరికింది. 

‘దొరికిన దానితో తృప్తి పడమని గురువుగారు చెప్పారు కదా. ఈ వెండి తీసుకుని మనం ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోదాం’ అన్నాడు రామయ్య. సోమయ్యకు, చంద్రయ్యకు ఆ మాటలు నచ్చలేదు. ‘‘పడినది నీ రాయి మాత్రమే. నువ్వు వెళ్లిపో. మేము మా అదృష్టం పరీక్షించుకుంటాం’’ అని, వారు మరింత ముందుకు వెళ్తామన్నారు. రామయ్య మాత్రం వెండి తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. 
సోమయ్య, చంద్రయ్య ముందుకు నడుస్తున్నారు. ఇంతలో సోమయ్య చేతిలో రాయి కిందపడింది. అక్కడ తవ్వితే బంగారం దొరికింది. బంగారంతో తృప్తి చెంది వెనక్కుపోదామన్న సోమయ్య మాటలు చంద్రయ్యకు నచ్చలేదు. తాను మరింత ముందుకు వెళ్తానన్నాడు. సోమయ్య మాత్రం బంగారం తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. చంద్రయ్య మరింత దూరం నడుస్తుండగా చేతిలో రాయి కిందపడింది. అక్కడ తవ్వితే చాలా వజ్రాలు దొరికాయి. వాటిని మూట కట్టుకున్నాడు. అక్కడితో తృప్తి చెందక, ముందుకు వెళితే మరింత సంపద దొరుకుతుందనే దురాశతో నడవటం మొదలుపెట్టాడు. కొంతదూరం వెళ్లేసరికి అక్కడ అపార ధనసంపద కనపడింది. అక్కడే ఒక వ్యక్తి కనిపించాడు. అతడి నెత్తి మీద చక్రం తిరుగుతోంది. చంద్రయ్య ఆ వ్యక్తి వైపే తదేకంగా చూస్తున్నాడు. చంద్రయ్య మనసు గ్రహించిన ఆ వ్యక్తి, చంద్రయ్యను పిలిచి, ‘‘అయ్యా! నా దగ్గర మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు, రత్నాలు, బంగారం ఇలా కావలసినంత సంపద ఉంది. మీరు ఒకసారి వచ్చి, ఇక్కడ నిలబడితే ఈ అపార సంపద మీదే అన్నాడు. అత్యాశ, దురాశ ఉన్న చంద్రయ్య వెంటనే అక్కడకు వెళ్లి, ఆ వ్యక్తి స్థానంలో నిలబడ్డాడు. వెంటనే ఆ చక్రం చంద్రయ్య తలపై తిరగటం ప్రారంభమైంది. తల కదపలేకపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 

‘ఈ చక్రం ఇలా తిరుగుతోందేంటి?’ అని ప్రశ్నించాడు చంద్రయ్య. అందుకు ఆ వ్యక్తి, ‘మనందరం ఆ గురువు గారి శిష్యులమే. నేను కూడా ఆయన మాట వినకుండా అత్యాశతో వచ్చి, ఇక్కడ చిక్కుకుపోయా. నీ రూపంలో నాకు విముక్తి వచ్చింది. నీకు విముక్తి రావాలంటే మరో వ్యక్తి రావలసిందే. దురాశకుపోతే ఇటువంటి శిక్ష తప్పదు’ అంటూ వెళ్లిపోయాడు. తన తప్పేమిటో అర్థం అయింది చంద్రయ్యకు. రామాయణంలో రావణుడు అత్యంత సంపన్నుడు. విలాసవంతమైన జీవితం గడపడానికి కావలసినంత సంపదలు ఉన్నవాడు. కానీ, తనకున్న అపారమైన సంపదతో తృప్తి చెందకుండా, సీతను చెరపట్టి, వంశ నాశనానికి కారకుడయ్యాడు. భారతంలో దుర్యోధనాదులు కూడా పాండవుల సంపదలకు ఆశపడ్డారు. వారితో యుద్ధానికి సిద్ధపడ్డారు. శ్రీకృష్ణుడు రాయబారం నడిపినా, వినలేదు. చివరకు యుద్ధంలో పాండవులతో తలపడి కౌరవులందరూ మరణించారు. అలాగే, అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. కానీ, తన వెంట ఏదీ రాదని చివరకు తెలుసుకున్నాడు. అందుకే సంతృప్తిగా జీవించటంలోనే ఆనందం ఉందని పెద్దలు చెప్పినమాట శిరోధార్యం. - డా. వైజయంతి పురాణపండ ఫోన్: 80085 51232