మార్చి ఫస్ట్ వీక్​లో అభ్యర్థుల ప్రకటన!

మార్చి ఫస్ట్ వీక్​లో అభ్యర్థుల ప్రకటన!

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వడపోతను కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. మంగళవారం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) సమా వేశాన్ని నిర్వహించగా.. షార్ట్ లిస్ట్ చేసే అభ్యర్థులను టిక్ చేసి ఇవ్వాల్సిందిగా కమిటీ సభ్యులకు పార్టీ పెద్ద లు సూచించారు. బుధవారం మధ్యాహ్నం వరకు రిపోర్టులు ఇవ్వాల్సి ఉండగా.. కొందరు నేతలు ఇంకా అందజేయలేదని సమాచారం. వీలైనంత తొందరగా అ భ్యర్థులను ప్రకటించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. మార్చి మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 19న మరోసారి పీఈసీ సమావేశాన్ని నిర్వహించి.. ముగ్గురు అభ్యర్థుల చొప్పున సెలెక్ట్ చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపనున్నట్టు తెలుస్తున్నది.

ఈలోపు ఎవరైనా సమర్థవంతమైన నేతలు పార్టీలో చేరినా.. వారి పేర్లనూ పరిగణనలోకి తీసుకుంటారని చెప్తున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సూచనల మేరకు స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికను వచ్చే నెల మొదటి వారంలోపు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. అభ్యర్థుల ప్రకటన పూర్తయితే ప్రజల్లోకి వెళ్లేందుకు వీలవుతుందని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. కనీసం 13 సీట్లు గెలవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ లీడర్లు.. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంట్ ఎలక్షన్లలోనూ తమ మార్క్​ చూపించాలని భావిస్తున్నారు.