
- జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల స్వైరవిహారం
- గుంపులుగా పిల్లలు, వృద్ధులపై దాడులు
- వాహనదారుల వెంటపడి కరుస్తున్న శునకాలు
- ఐదేండ్లలో రేబిస్‌తో ఇద్దరి మృతి
- కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లలో నిర్లక్ష్యం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోడ్లపై గుంపులుగా తిరుగుతున్న డాగ్స్ చిన్నారులు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇండ్ల ముందు ఆడుకుంటున్న వారిని కరుస్తున్నాయి. వాహనదారులను వెంబడించి కొరుకుతున్నాయి. దీంతో కుక్కల గుంపు కనిపిస్తే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 2021 నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 7,664 డాగ్ బైట్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన ఏటా సగటున 1,533, రోజుకు నాలుగు నుంచి ఐదు కేసులు వస్తున్నాయి. ఇవే కాకుండా ప్రభుత్వం దగ్గర రికార్డు కానివి ఎన్నో ఉన్నాయి. కుక్క కాటుతో 2021లో ఒకరు, 2024లో మరొకరు మరణించారు.
ఒంటరిగా వెళ్లాలంటే భయం
కుక్కల పాపులేషన్ దినదినం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులుగా కనిపిస్తున్నాయి. ఇండ్లలో, ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలను రోడ్ల పక్కన పడేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో కుక్కలు మకాం వేస్తున్నాయి. వచ్చిపోయే జనాలతో పాటు పశువులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతున్నామని, రాత్రిపూట కుక్కల అరుపులతో నిద్రపట్టడం లేదని పలువురు వాపోతున్నారు. వీటిని కంట్రోల్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
బర్త్ కంట్రోల్‌పై నిర్లక్ష్యం
జిల్లాలో కుక్కల బెడద నివారణలో భాగంగా వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంచిర్యాల అండాలమ్మ కాలనీలో రూ.35 లక్షలతో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్(ఏబీసీ) ఏర్పాటు చేశారు. దీనిని హైదరాబాద్‌కు చెందిన ఒక ఏజెన్సీకి అప్పగించారు. వారు కుక్కలను పట్టుకొని స్టెరిలైజేషన్ చేయడంతో పాటు అవి కోలుకునేవరకు ఆహారం అందించి ఆ తర్వాత తీసుకొచ్చిన ప్రాంతంలోనే వాటిని వదిలేయాలి.
దీనికి మున్సిపాలిటీ నుంచి ఒక్కో కుక్కకు రూ.1,650 చొప్పున చెల్లిస్తున్నారు. అయినప్పటికీ ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 10 వేలకు పైగా కుక్కలు ఉన్నట్టు అంచనా. కానీ నిరుడు 500, ఈ ఏడాది ఇప్పటివరకు మరో 500 కుక్కలకు మాత్రమే ఆపరేషన్లు చేసినట్టు రికార్డులు చూపుతున్నారు. ఇదే రీతిలో ఆపరేషన్లు చేస్తూ పోతే పదేండ్లు పడుతుంది. అప్పటికి వీధి కుక్కల సంఖ్య తగ్గకపోగా, రెట్టింపయ్యే చాన్స్ ఉంది. కాబట్టి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లను స్పీడప్ చేయాల్సిన అవసరముంది.
ఈ బాలిక పేరు అక్షిత. కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామం. చిన్న ధర్మారంలోని ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది. ఆమె తల్లి కాసిపేట మోడల్ స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం స్కూల్‌కు సెలవు కావడంతో తల్లితో పాటు మోడల్ స్కూల్‌కు వెళ్లింది. స్కూల్ దగ్గరలో ఆడుకుంటున్న అక్షితపై అక్కడున్న వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. తల, మెడ, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రంగా గాయపర్చాయి. చిన్నారిని మంచిర్యాల జీజీహెచ్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. సీసీ టీవీ ఫుటేజీలో కుక్కలు ఎంత దారుణంగా దాడి చేశాయో రికార్డు కాగా ఆ దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. ఈ ఘటనపై బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి స్పందించి ఎంపీడీవో, ఎంపీవో, ముత్యంపల్లి పంచాయతీ సెక్రటరీపై సుమోటో కేసు ఫైల్ చేసి నోటీసులు జారీ చేశారు.
ఏబీసీని వేరే ఏజెన్సీకి అప్పగిస్తాం..
వీధి కుక్కల జనాభాను కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్(ఏబీసీ)ను ఇప్పుడున్న ఏజెన్సీ సరిగా నిర్వహించడం లేదు. త్వరలోనే వేరే ఏజెన్సీకి అప్పగించి ఆపరేషన్ల సంఖ్య పెంచుతాం. ఇతర మున్సిపాలిటీల నుంచి తీసుకొచ్చిన కుక్కలను ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడే వదిలేస్తున్నారని తెలిసింది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి పట్టుకొచ్చి అండాలమ్మ కాలనీ సమీపంలో విడిచిపెడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీంతో మంచిర్యాలలో స్ట్రీట్ డాగ్స్ పాపులేషన్ పెరుగుతోంది. - సంపత్, కమిషనర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్
జిల్లాలో డాగ్ బైట్ కేసుల వివరాలు
ఏడాది కేసులు
2021 2,168
2022 1,685
2023 2,277
2024 857
2025- 677