వీధి కుక్కల నియంత్రణ కోసం ఆపరేషన్లు.. ఏసీ గదుల్లో కుక్కలకు వసతి

వీధి కుక్కల నియంత్రణ కోసం ఆపరేషన్లు.. ఏసీ గదుల్లో కుక్కలకు వసతి
  •  అంతాయానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ పర్యవేక్షణ లోనే..  

సత్తుపల్లి, వెలుగు : చిన్న, పెద్ద లేకుండా అందరి మీదకు ఎగబడుతూ భయభ్రాంతులకు గురిచేసే వీధి కుక్కల నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. వీధి కుక్కల సంఖ్యను ఘనంగా తగ్గించేందుకు జనన నియంత్రణ ఆపరేషన్​ చేయాలని నిర్ణయించారు. 

యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) ప్రాజెక్ట్ ద్వారా వెటర్నరీ డాక్టర్లు హైదరాబాద్ కు చెందిన యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి పర్యవేక్షణలో కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించి జనన నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. ఆపరేషన్ చేసిన తరువాత కూడా 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఏసీ గదుల్లో ఉంచి సంరక్షిస్తున్నారు. గతంలో వీధి కుక్కలను పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టే వారు. ఇలా రీ లోకెట్ చేయడం వల్ల సత్ఫలితాలు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం  బర్త్​ కంట్రోల్​ ఆపరేషన్లు చేయిస్తోంది.  

ఒక్కో కుక్క కోసం రూ.2 వేలు ఖర్చు.. 

మున్సిపాలిటీల్లో ఒక్కో వీధి కుక్కను పట్టుకున్నందుకు రూ.200, వాటి పర్యవేక్షణ, ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం రూ.1800 చొప్పున రూ.2 వేలు ఖర్చు చేస్తున్నారు. 10 నెలల కింద కూడా ఇలాంటి డ్రైవ్ చేపట్టారు. ఇప్పుడు పట్టణంలోని సుమారు 650 వీధి కుక్కలను గుర్తించి వాటికి ఆపరేషన్లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.