వీధి కుక్కల భీభత్సం.. ఏడాది చిన్నారిపై దాడి

వీధి కుక్కల భీభత్సం.. ఏడాది చిన్నారిపై దాడి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు వెంటపడి మరీ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కుక్కలను చూస్తే ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం భయపడుతున్నారు. వీధి కుక్కల దాడిలో ఇదివరకే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

జూన్ 28వ తేదీ బుధవారం వరంగల్ పట్టణంలోని ఎల్బీనగర్, ఇస్లాంపురా ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది పాపపై కుక్కల దాడి చేయగా.. చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారి మొహంపై కుక్క కరవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. పాపతో పాటు ఆ ప్రాంతంలో పలువురిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయాలపాలైయ్యారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.