హాలీవుడ్‌లో అతిపెద్ద డీల్: నెట్‌ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్! డీల్ విలువ ఎంతంటే..

హాలీవుడ్‌లో అతిపెద్ద డీల్: నెట్‌ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్! డీల్ విలువ ఎంతంటే..

ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ(WBD)ని కొనుగోలు రేసులో అత్యధిక బిడ్డర్ గా నిలిచింది. డీల్ విలువ ఏకంగా 82.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఒప్పందం హాలీవుడ్ రూపాన్ని పూర్తిగా మార్చగలదని విశ్లేషకులు చెబుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈఓలు టెడ్ సారండోస్, గ్రెగ్ పీటర్స్ నాయకత్వంలో చేపట్టిన ప్రయత్నానికి "ప్రాజెక్ట్ నోబెల్" అని పేరు పెట్టారు.

ఈ మెగా డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్ బ్యాంకుల కన్సార్టియం నుంచి 59 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని పొందింది. WBD కొనుగోలు ద్వారా వినియోగదారులకు మరింత వైవిధ్యభరితమైన కంటెంట్ అందించవచ్చని, తమ సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను కూడా మెరుగుపరుచుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్ చెబుతోంది. అలాగే స్టూడియో కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, ఏటా 2 బిలియన్ డాలర్ల నుండి 3 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులను తగ్గించుకోవడానికి డీల్ సహాయపడుతుందని స్ట్రీమింగ్ దిగ్గజం వెల్లడించింది. 

ఈ కొనుగోలు నెట్‌ఫ్లిక్స్‌కు "గేమ్ ఆఫ్ థ్రోన్స్," "డిసి కామిక్స్," "హ్యారీ పోటర్" వంటి ప్రపంచ స్థాయి ఫ్రాంచైజీలను అందించనుంది. డిస్నీ, పారామౌంట్ వంటి సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని ఎదుర్కోవడానికి, సొంత కంటెంట్ లైబ్రరీని బలోపేతం చేసుకోవడానికి ఈ డీల్ చాలా కీలకంగా మారనుందని కంపెనీ భావిస్తోంది. హిట్ షోలు, సినిమాల హక్కులను సొంతం చేసుకోవడం, బయటి స్టూడియోలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే నెట్‌ఫ్లిక్స్ లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. పాస్‌వర్డ్ షేరింగ్ కట్టడి విజయం తర్వాత గేమింగ్, ఇతర కొత్త వృద్ధి మార్గాల్లోకి నెట్‌ఫ్లిక్స్ అడుగుపెట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. 

ఈ ప్రతిపాదనలో 5.8 బిలియన్ డాలర్లకు బ్రేకప్ ఫీజు ఉంది. ఒకవేళ ఒప్పందం రద్దయినా లేదా నెట్‌ఫ్లిక్స్ ఈ మొత్తాన్ని WBDకి చెల్లించాల్సి ఉంటుంది. డీల్‌లో భాగంగా WBD వాటాదారులు ప్రతి షేరుకు 23.25 డాలర్ల క్యాష్ పేమెంట్ అలాగే 4.50 డాలర్ల విలువైన నెట్‌ఫ్లిక్స్ స్టాక్ పొందుతారు. అయితే వార్నర్ బ్రదర్స్ లీనియర్ నెట్‌వర్క్ వ్యాపారం (CNN, TNT, HGTV, డిస్కవరీ+) మాత్రం ఈ డీల్ నుండి వేరు చేయబడుతుంది.

నెట్‌ఫ్లిక్స్ ఈ కొనుగోలు తర్వాత కూడా "థియేట్రికల్ రిలీజ్‌లతో సహా" వార్నర్ బ్రదర్ సంస్థ ప్రస్తుత కార్యకలాపాలను కొనసాగిస్తామని కూడా హామీ ఇచ్చింది. అయినప్పటికీ.. థియేటర్ యజమానులు ఇప్పటికే తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ చరిత్రలో అతిపెద్ద కొనుగోళ్లలో ఒకటిగా నిలిచే ఈ డీల్..  స్ట్రీమింగ్ యుగంలో కంటెంట్, మార్కెట్ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని చెప్పొచ్చు.