స్ట్రీట్ వెండర్స్కు సంఘాలు..మహిళా సంఘాల తరహాలో ఏర్పాటు

స్ట్రీట్ వెండర్స్కు సంఘాలు..మహిళా సంఘాల తరహాలో ఏర్పాటు
  •      వ్యాపారాల వృద్ది కోసం బ్యాంకు లోన్లు

కామారెడ్డి​​, వెలుగు:  రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారితో సంఘాలు ఏర్పాటు చేసి.. వారి వ్యాపార అభివృద్ధికి మెప్మా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే 99 సంఘాలు ఏర్పాటు చేయగా.. మరిన్ని సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. పట్టణాల్లో చాలా మంది రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేస్తుంటారు. 

పండ్లు, కూరగాయలు, చిరు తిండ్లు, చాయ్​ బండ్లు, వివిధ వస్తువులు అమ్ముతూ జీవిస్తున్నవారిలో ఎక్కువ మంది పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వడ్డీలకు అప్పు తీసుకుంటారు. కొందరు ఏరోజుకు ఆరోజే చెల్లించేలా అప్పు తీసుకుంటారు. పొద్దున అప్పు తీసుకుని సరుకులు కొని.. వాటిని అమ్మి రాత్రికి అసలు, వడ్డీ కట్టేస్తారు. మరికొందరు డైలీ ఫైనాన్స్​ రూపంలో అప్పులు చేస్తారు. 

ప్రైవేట్​ వ్యక్తులు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుండడంతో స్ట్రీట్​ వెండర్స్​ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుంటారు. కరోనా టైంలో స్ర్టీట్​ వెండర్స్​పడ్డి కష్టాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం వారికి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పించింది. మొదట రూ.5వేల వరకు అప్పు ఇప్పించి.. సక్రమంగా చెల్లించిన వారి పరిమితి పెంచుతూ పోయింది. 

ఈ క్రమంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళాసంఘాల తరహాలో స్ర్టీట్​ వెండర్స్​తో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంఘాల్లో స్ట్రీట్​ వెండర్లు ఆడవారైనా.. మగవారైనా సభ్యులుగా ఉండవచ్చు. జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్ర్టీట్​ వెండర్స్​ వివరాలను మెప్మా అధికారులు సేకరించారు. వారికి సంఘాలపై అవగాహాన కల్పించి ఒకే తరహా వ్యాపారం చేసే ఐదుగురిని కలిపి ఒక్కో సంఘాన్ని ఏర్పాటు చేశారు. 

వీరితో బ్యాంక్​ అకౌంట్లు తీయించారు. సంఘంలో సభ్యులైన వారు నెలకు ఒక్కొక్కరు రూ.100 నుంచి రూ. 5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వరకు పొదుపు చేసుకోవచ్చు. వారికి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తారు. దీంతోపాటు స్ట్రీట్​ వెండర్లకు డిజిటల్​ లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే లోన్లు లభించడంతో వెండ్లరకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది.

 తక్కువ వడ్డీ కావడంవల్ల లోన్​తీసుకుని వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఐదుగురు వ్యాపారులు ఒకే చోట ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే తక్కువ రేటుకే వస్తువులు దొరుకుతాయి. దీనివల్ల వ్యాపారులకు మేలు కలుగుతుంది. ఒక్కో సంఘానికి ఒక క్రెడిట్​ కార్డు ఇస్తారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువగా డిజిటల్​ లావాదేవీలు చేసిన వారికి ప్రొత్సహాకాలు ఇస్తారు. వ్యాపారాభివృద్ధి గురించి అవగాహన కోసం మీటింగ్​లు నిర్వహిస్తారు. 

వ్యాపారం పెంచుకోవచ్చు 

స్ర్టీట్​ వెండర్​ సంఘాలతో వారికి ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగుపర్చవచ్చు. వారికి బ్యాంక్​ల ద్వారా లోన్లు ఇప్పిస్తున్నాం. దీంతో వ్యాపారాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. -- శ్రీధర్​రెడ్డి, మెప్మా, పీడీ-కామారెడ్డి

జిల్లాలో ఏర్పాటైన సంఘాల వివరాలు

 మున్సిపాలిటీ     సంఘాల సభ్యులు 
 కామారెడ్డి                 67 335
బాన్సువాడ              19 95
ఎల్లారెడ్డి                   13 65