- గతేడాది 16 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసిన రవాణా శాఖ
- డ్రంకెన్, ర్యాష్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌తోపాటు, మైనర్లకు వెహికల్స్ ఇచ్చినా చర్యలే
- హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 13 వేలకు పైగా లైసెన్స్‌ల సస్పెన్షన్
హైదరాబాద్, వెలుగు: నిర్లక్ష్యంగా వాహనాలను నడిపే వాళ్లపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రంకెన్‌డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌చేస్తూ పట్టుబడితే కేసులు పెట్టడంతోపాటు 6 నెలల పాటు లైసెన్సులు సస్పెండ్ చేస్తున్నారు. మైనర్లకు వెహికల్స్ ఇచ్చిన ఓనర్లపైనా చర్యలు తీసుకుంటున్నారు.
గతేడాది పోలీస్‌శాఖ చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్రంలో ఏకంగా16 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లను రవాణా శాఖ సస్పెండ్‌చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో13 వేలకు పైగా లైసెన్స్‌లు సస్పెండ్ అయ్యాయి. డ్రైవింగ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారిపై పోలీసులు కేసు బుక్ చేస్తున్నారు. వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయాలని రవాణా శాఖకు సిఫారసు చేస్తున్నారు. ఆ వెంటనే సంబంధిత వాహనదారునికి దీనిపై వివరణ కోరుతూ నోటీసులు అందుతున్నాయి.
రవాణా శాఖ అధికారులకు సంబంధిత వాహన యజమానుల నుంచి సంతృప్తికరమైన వివరణ వస్తే సరి. లేదంటే మొదటిసారిగా ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను ట్రాన్స్‌పోర్టు అధికారులు సస్పెండ్ లో పెడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో..అంటే పోలీసుల కమిషనరేట్ల వారిగా చూస్తే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోనే 85 శాతం వరకు ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయి. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కేవలం15 శాతం వరకు డ్రైవింగ్ లైసెన్స్ లు సస్పెన్షన్ లో ఉంచారు.
పదే పదే మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మైనర్లకు వెహికల్స్ ఇచ్చిన కేసుల్లో ప్రధానంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ లు సస్పెన్షన్ కు గురవుతున్నాయి.
మళ్లీ పట్టుబడితే మరో ఆరు నెలలు..
గత ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే 5 వేల 800 పైచిలుకు డ్రైవింగ్ లైసెన్స్ లను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సైబరాబాద్ పరిధిలో 4 వేల 800 వరకు, మూడో స్థానంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 వేల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లను పోలీసుల సిఫారసు మేరకు, కేసు తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ లను రవాణా శాఖ సస్పెండ్ చేసింది.
ఈ మూడు కమిషనరేట్ల తర్వాత వరంగల్ లోనే ఎక్కువగా ఇలాంటి కేసుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పండ్ చేశారు. సుమారు వెయ్యికిపైనే ఇక్కడ సస్పెండ్ చేయగా, మిగతా జిల్లాల్లో అడపా, దడపా ఇలాంటి కేసులు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయిన ఆరు నెలల కాలంలో సంబంధిత వాహన యజమానులపై మళ్లీ ఇలాంటి ఫిర్యాదులు పోలీసుల నుంచి రవాణా శాఖకు రానట్లయితే తిరిగి ఆ లైసెన్స్ లను పునరుద్ధరిస్తారు.
ఒకవేళ అవే కేసులు పునరావృతం అయితే సస్పెండ్ వ్యవధిని మరో ఆరు నెలలు పెంచుతామని, ఎక్కువ నేరారోపణలు ఉంటే ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ లో ఉంచుతామని రవాణా అధికారులు చెప్తున్నారు.
