- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలల నుంచి కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటిని సంరక్షించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లోని గోశాలలో అర్హులైన రైతులకు బుధవారం 103 జతల కోడెలను పంపిణీ చేశారు. వ్యవసాయ భూమి ఉందా? ఇప్పటికే పశువులు ఉన్నాయా అని రైతులను కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ కోడెల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించామని, ప్రస్తుతం 238 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత ఉన్న రైతులకే కోడెలను పంపిణీ చేశామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ అధికారులతో తనిఖీ చేయిస్తామని, ఎవరైనా కోడెలను ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, ఈవో రమాదేవి, ఆర్డీవో రాధాబాయ్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, గోశాల బాధ్యులు పాల్గొన్నారు.
