మార్కుల ఆధారంగా స్టూడెంట్లను విభజిస్తే కఠిన చర్యలు

మార్కుల ఆధారంగా  స్టూడెంట్లను విభజిస్తే కఠిన చర్యలు
  • టాపర్స్​ బ్యాచ్, డల్​ బ్యాచ్ అంటూ విద్యార్థులను వేరుచేస్తే కఠిన చర్యలు
  •     టార్గెట్ల పేరుతో పిల్లలను చులకన చేసినా, అందరి ముందు తిట్టినా క్రిమినల్ కేసులే 
  •     ప్రతి విద్యాసంస్థలో సేఫ్టీ ఫ్యాన్లు, టెర్రస్​పైకి వెళ్లకుండా గేట్ల ఏర్పాటు తప్పనిసరి
  •     రూల్స్ బ్రేక్ చేస్తే విద్యాసంస్థల గుర్తింపు రద్దు
  •     కలెక్టర్ల నేతృత్వంలో నిఘా కమిటీలు
  •     సర్కారు తాజా గైడ్​లైన్స్ రిలీజ్ 

హైదరాబాద్, వెలుగు: ఇకపై స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ‘టాపర్స్ బ్యాచ్’.. ‘డల్ బ్యాచ్’ అంటూ స్టూడెంట్లను వేరు చేసి చూపే పరిస్థితి మారనుంది. మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడింగ్ చేసి, వారి మధ్య అంతరాలు సృష్టిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల ‘సెక్షన్ల దందా’కు సర్కార్ చెక్ పెట్టింది. చదువులో వెనుకబడ్డారని వేరే సెక్షన్లకు మార్చడం, టార్గెట్లు రీచ్ కాలేదని అందరి ముందు అవమానించడం లాంటివి చేసినా క్రిమినల్​చర్యలు తప్పవని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. విద్యార్థుల రక్షణ కోసం విద్యార్థుల రక్షణ, మానసిక ఆరోగ్యంపై కఠినమైన నిబంధనలను విధించింది.ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సర్కారు, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రైనింగ్ సెంటర్లు, కోచింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ అకాడమీలు, హాస్టళ్లు తదితర అన్ని విద్యాసంస్థలు ఉత్తర్వులు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని విద్యాసంస్థలు ఒకే రకమైన మానసిక ఆరోగ్య పాలసీని అమలు చేయాలని సూచించారు.  ఈ పాలసీని ప్రతి సంవత్సరం సమీక్షించి అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేయాలని, సంస్థ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లు, నోటీసు బోర్డుల్లో అందరు చూసేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రూల్స్ బ్రేక్ చేస్తే విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని  సూచించారు. 

వంద మందికొక సైకాలజిస్ట్ ఉండాల్సిందే..

రాష్ట్రంలోని వంద మంది లేదా అంతకంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రతి స్కూల్, కాలేజీ, హాస్టల్ తప్పనిసరిగా ఒక క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ లేదా సోషల్ వర్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించుకోవాల్సి ఉంది. పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే, బయట ఉండే మానసిక వైద్యులతో ఒప్పందం కుదుర్చుకోవాలి. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది కౌన్సిలర్లను నియమించుకోవాలి. పరీక్షల టైమ్​లో, అకడమిక్ మార్పుల టైమ్​లో విద్యార్థులకు అండగా ఉండేందుకు చిన్న గ్రూపులకు ప్రత్యేక మెంటార్లను కేటాయించాలని గైడ్​లైన్స్ లో పేర్కొన్నారు. 

ట్యాంపర్ ఫ్రూఫ్ ఫ్యాన్లు తప్పనిసరి..

విద్యాసంస్థల్లో, హాస్టళ్లలో ఆత్మహత్యలను నివారించేందుకు భవన నిర్మాణాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిల్లో సీలింగ్ ఫ్యాన్లకు ట్యాంపర్ ప్రూఫ్  (ఎవరైనా వేలాడితే జారిపోయేలా, ఆగిపోయేలా ఉండే పరికరాలు) ఏర్పాటు చేయాలని సూచించింది. విద్యార్థులు ఆవేశంలో దూకేయకుండా ఉండేందుకు.. మేడపైకి, బాల్కనీల్లోకి వెళ్లకుండా గేట్లు, గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్టల్ వార్డెన్లు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని.. డ్రగ్స్, ర్యాగింగ్ లేకుండా చూడాలని పేర్కొన్నారు. టీచర్లు, వార్డెన్లకు ఏడాదికి రెండుసార్లు పిల్లల సైకాలజీపై, ప్రథమ చికిత్సపై ట్రైనింగ్ ఇప్పించాలని.. ఎవరైనా విద్యార్థి డిప్రెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే వెంటనే గుర్తించేలా వారిని సిద్ధం చేయాలని వెల్లడించారు. 

కులం, మతం పేరుతో వేధించొద్దు.. 

విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, ఎల్జీబీటీక్యూ+, దివ్యాంగులు, అనాథ పిల్లలపై ఎలాంటి వివక్ష చూపొద్దని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. కులం, మతం పేరుతో వివక్ష లేకుండా చూసుకోవాలన్నారు. ర్యాగింగ్, లైంగిక వేధింపులు, కుల వివక్షపై వచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి కమిటీ వేయాలని.. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే.. వారిని తిరిగి వేధించకూడదని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేస్తే, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులకు కేవలం చదువే కాకుండా స్పోర్ట్స్, ఆర్ట్స్, పర్సనాలిటీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ఎగ్జామ్స్ విధానాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని, పిల్లలపై బరువు తగ్గించేలా చూడాలని సూచించారు. కేవలం మార్కులు, ర్యాంకులే జీవితం కాదనే భావన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

కోచింగ్ హబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ లాంటి మహా నగరాలకు కోచింగ్ కోసం వస్తున్న వేలాది మంది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పోటీ పరీక్షల కోసం వచ్చే పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నందున.. అక్కడ నిరంతరం కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. చదువు ఒత్తిడిని తగ్గించేలా అకడమిక్ ప్లానింగ్ ఉండాలని, దీనిపై ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. కోచింగ్ సెంటర్లు, కాలేజీలు పిల్లలకు, తల్లిదండ్రులకు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వాలని వెల్లడించారు. అందరూ డాక్టర్లు, ఇంజినీర్లు కాలేరు కాబట్టి.. పిల్లల ఆసక్తిని బట్టి ఇతర మంచి కోర్సులు, అవకాశాల గురించి వివరించాలని, కేవలం ఒకే రకమైన చదువు గొప్పది అనే భావన కలిగించకూడదని వివరించారు. పేరెంట్స్.. పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెంచవద్దని, వారి ఇష్టాయిష్టాలను గౌరవించాలని పేర్కొన్నారు.

 కలెక్టర్లకే పవర్..

ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో చూసేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో మానిటరింగ్ కమిటీ ఉంటుంది. వీరు స్కూళ్లు, కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఫిర్యాదులు స్వీకరిస్తారు. రూల్స్ పాటించని వారిపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ 'ఉమ్మీద్', 'మనోదర్పణ్', 'నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్' పథకాల నుంచి సూచనలు తీసుకుని ప్రతి కాలేజీ సొంతంగా 'మెంటల్ హెల్త్ పాలసీ'ని తయారు చేసుకోవాలి. దాన్ని వెబ్ సైట్ లో పెట్టాలి. టెలి-మానస్ వంటి హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్లు క్లాస్ రూమ్ గోడలపై పెద్దగా కనిపించేలా రాయించాలి. ఆత్మహత్యల నివారణకు విద్యాసంస్థలు.. లోకల్ హాస్పిటల్స్ తో లింక్ అప్ ఉండాలని సూచించారు.