హైదరాబాద్, వెలుగు: ‘‘ఉద్యోగులు లేదా కార్మికులు సమ్మెలోకి వెళ్లడమంటే వారు పని ఎగ్గొట్టినట్టు ఎంతమాత్రం కాదు. సమ్మె చేయడమంటే పనిచేసే చోట మెరుగైన వసతులు కల్పించాలని కోరడమే అవుతుంది”అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె ఇల్లీగల్అని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై సోమవారం విచారణను ముగించిన హైకోర్టు మంగళవారం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో కోర్టు ఏమందంటే.. ‘‘ఆర్టీసీ సమ్మె లీగలా? ఇల్లీగలా? అని ప్రకటించే పరిధి హైకోర్టుకు లేదు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాల్సింది లేబర్‌కోర్టే. కన్సీలియేషన్ ఆఫీసర్(జాయింట్ కమిషనర్-కార్మిక శాఖ)కు కూడా సమ్మె చట్టవ్యతిరేకమని ప్రకటించే అధికారం లేదు. అక్టోబర్ 5న ఆ మేరకు చేసిన ప్రకటనను విస్మరించాలి. ఆ ప్రకటన చట్ట వ్యతిరేకం. దానిని లేబర్ కమిషనర్‌గానీ, లేబర్ కోర్టుగానీ గమనంలోకి తీసుకోరాదు. కన్సీలియేషన్ ఫెయిల్ అయినట్లు కార్మిక శాఖ కమిషనర్ రెండు వారాల్లోగా లేబర్ కోర్టుకు నివేదిక ఇవ్వాలి. ఒకవేళ ఆ విధంగా కమిషనర్ చేయకపోతే అందుకు కారణాల్ని తెలియజేయాలి. ఈ కేసుతో సంబంధం ఉన్న రెండు పక్షాల వారికీ ఆ కారణాల నివేదికను కమిషనర్ నివేదించాలి.
పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టంలోని సెక్షన్ 12 కింద కమిషనర్ నిర్ణయించాలి. అదే చట్టంలోని సెక్షన్ 12(4) కింద కన్సీలియేషన్ ఫెయిల్యూర్ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాలి. అదే చట్టంలోని సెక్షన్ 12(5) ప్రకారం లేబర్ కోర్టుకు నివేదించాలో లేదో కమిషనర్ నిర్ణయించాలి. సమ్మె చేయడమంటే పనిచేసే చోట మెరుగైన వసతులు కల్పించాలని కోరడమే. ఉద్యోగులు లేదా కార్మికులు సమ్మెలోకి వెళ్లడమంటే పని ఎగ్గొట్టినట్టు కాదు. ఎక్స్‌ప్రెస్ న్యూస్ సర్వీసెస్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అదే చెబుతున్నాయి. సమ్మెలోకి వెళ్లిన వారి పట్ల ఔదార్యంతో పాలక పెద్దలు ఆలోచించాలి. సిండికేట్ బ్యాంక్-ఉమేష్ నాయర్ కేసులో 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం లేబర్ కోర్టే సమ్మె లీగల్ లేదా ఇల్లీగల్ అనేది తేల్చాలి. సమ్మె చట్టబద్ధమో కాదో తేల్చే పరిధి హైకోర్టుకు లేదని కూడా సుప్రీం తేల్చింది.
ఇదే సమయంలో చర్చలు జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేం. ప్రజాహితం దృష్ట్యా అన్ని ప్రయత్నాలు చేశాం. ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇప్పటి వరకూ పరిష్కారం కాకుండా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై సర్కార్, ఆర్టీసీ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. సమ్మె కారణంగా ప్రయాణీకులు ఇక్కట్లు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశిస్తున్నాం. 48 వేల ఆర్టీసీ ఉద్యోగుల కోణంలోనే ఈ సమస్యను చూడొద్దు. రవాణా కోణంలో రాష్ట్రంలోని ప్రజలందరి సమస్యగా చూడాలి. సమ్మె చేసిన వాళ్లను విధుల్లోకి తీసుకోవాలని కూడా ఉత్తర్వులు ఇవ్వలేం. 48 వేల మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా మానవీయకోణంలో స్పందించి సమస్య పరిష్కారానికి ఆర్టీసీ, సర్కార్ చర్యలు తీసుకోవాలి”అని పేర్కొంది.

