సరిహద్దుల వద్ద పటిష్ట నిఘా ఉండాలి : చందన్ కుమార్

 సరిహద్దుల వద్ద పటిష్ట నిఘా ఉండాలి :  చందన్ కుమార్
  • ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగొద్దు
  • జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్
  • చెక్ పోస్ట్, ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ

ముదిగొండ, వెలుగు :  సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద నిఘా పటిష్టంగా చేపట్టాలని, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ అన్నారు. మండలంలోని వల్లభి గ్రామ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, ధాన్య కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్దతు ధరతో పాటు, సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నందున, ఇతర రాష్ట్రాల నుంచి సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 

ధాన్య రవాణాకు సంబంధించి పత్రాలు తనిఖీ చేయాలని, అక్రమ రవాణా అయితే కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేయాలన్నారు. చెక్ పోస్ట్ నిర్వహణ రిజిస్టర్లు పరిశీలించారు. వల్లభి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, ఇంతవరకు ఎంత మేర ధాన్యం కొనుగోలు చేసింది, ఎంతమేర సంబంధిత మిల్లులకు రవాణా చేసింది, ఎంత మేర నమోదు చేసింది పరిశీలించారు. రైతులకు కనీస మౌలిక సదుపాయాల కల్పన చేయాలని, కొన్న ధాన్యాన్ని వెంట వెంటనే ట్యాగ్ చెందిన మిల్లులకు రవాణా చేయాలన్నారు. రైతులకు ధాన్యం డబ్బులు అందేలా సంబంధిత నమోదులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఆయన వెంట పౌరసరఫరాల శాఖ డీటీ విజయ్ బాబు, అధికారులు, తదితరులు ఉన్నారు.