న్యాయవ్యవస్థ ఉత్తమంగా పనిచేసేందుకు చట్టాలే ఏకైక మార్గం

 న్యాయవ్యవస్థ ఉత్తమంగా పనిచేసేందుకు చట్టాలే ఏకైక మార్గం

మీకు నిజంగా మహిళలపై గౌరవం ఉంటే.. గుజరాత్ ప్రభుత్వం 11మంది రేపిస్టులను విడుదల చేయడాన్ని రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. బిల్కిస్ బానో కేసులో 11మంది నిందితుల్ని రిలీజ్ చేయడంపై కేటీఆర్ స్పందించారు. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. MHA ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం వికారంగా ఉందని చెప్పారు. ఈ విషయంపై దేశానికి చిత్తశుద్ధి చూపాలన్నారు.  ఈ సందర్భంగా భారతీయ శిక్షాస్మృతి (IPC) & క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC)కి తగిన సవరణలు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. అలా చేస్తే ఏ రేపిస్ట్ కూడా న్యాయవ్యవస్థ ద్వారా బెయిల్ పొందలేరని చెప్పారు. న్యాయవ్యవస్థ త్వరితగతిన బట్వాడా చేసేందుకు, ఉత్తమంగా పని చేసేందుకు బలమైన చట్టాలే ఏకైక మార్గమని కేటీఆర్ తెలిపారు.

బిల్కిస్‌ బానో కేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు సైతం మండిపడ్డాయి. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా నారీశక్తి గొప్పతనంపై ప్రధాని మోదీ మాట్లాడిన గంటల్లోనే బిల్కిస్‌ బానో కేసులో దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2002 గోద్రా ఘటన తర్వాత బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. అయితే ఈ కేసులో దోషులను ఇటీవలే బయటికి రావడంతో పలువురు స్వాగతాలు పలుకడంతో పాటు స్వీట్లు కూడా పంచుకున్నారు.