
సిద్దిపేట రూరల్, వెలుగు: రెండతస్తుల బిల్డింగ్‌పై చదువుకుంటున్న ఓ స్టూడెంట్ అనుకోని విధంగా దుర్మరణం పాలయ్యాడు. వంద మీటర్ల దూరం నుంచి ఎగిరివచ్చిన రాయి అతని ముఖానికి తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా తోర్నాలలో శుక్రవారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్టి మల్లేష్ కుమారుడు సురేష్ తోర్నాల హాస్టల్లో ఉంటూ సిద్దిపేట డిగ్రీ కాలేజీలో మెదటి సంవత్సరం చదువుతున్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 9న మొదలయ్యాయి. ఆ పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేందుకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి చెట్టు నీడన చదువుకుంటున్నాడు. పక్కనే రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్నసాగర్‌కు కాలువ పనులు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా బ్లాస్టింగ్ చేశారు. ఆ పేలుళ్లతో బండరాళ్లు ఎగిరిపడి బిల్డింగ్‌పై చదువుకుంటున్న సురేష్ తలకు బలంగా తాకాయి. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. తోటి స్టూడెంట్స్, హాస్టల్ నిర్వాహకులు సిద్దిపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏసీపీ రామేశ్వర్సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్టూడెంట్మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు తోర్నాల హాస్టల్ ముందు స్టూడెంట్మృతదేహంతో ధర్నా కు దిగారు. బ్లాస్టింగ్ చేసేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలా జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన స్టూడెంట్కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. స్టూడెంట్ మృతిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్టూడెంట్కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించి అన్నివిధాలా ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.