ట్రిపుల్ ఐటీ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

ట్రిపుల్ ఐటీ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలను పోలీసులు మెయిన్ గేట్ ముందు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముధోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 

ఇదిలా ఉంటే ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కు స్టూడెంట్ గవర్నింగ్ కమిటీ బహిరంగ లేఖ రాసింది. 4 డిమాండ్లను ముందుంచి వాటిని అమలుచేసేందుకు 7 రోజుల డెడ్ లైన్ పెట్టింది. క్యాంపస్ లోని ఎస్ ఎస్ క్యాటరర్స్, కేంద్రయ బండార్, శక్తి క్యాటరర్స్ ఏజెన్సీలను తొలగించడంతో పాటు మూడు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు ADSW, చీఫ్ వార్డెన్, SWO, ఇంఛార్జ్ క్యాటరర్స్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పింది. మెస్ నిర్వహణలో విద్యార్థుల సలహాలు సూచనలు తీసుకోవాలని, రాజకీయ నేతల ప్రమేయం లేకుండా మెస్ టెండర్లు ఖరారు చేయాలని స్టూడెంట్ గవర్నింగ్ కమిటీ స్పష్టం చేసింది. IIT, NIT తరహాలో విద్యార్థులకు భోజన వ్యవస్థ కల్పించాలని ఇందుకోసం కనీసం 10ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న కంపెనీకి మెస్ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేసింది. 

మరోవైపు బాసర ఘటనపై ఏబీవీపీ ఆందోళన తీవ్రతరం చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించి నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.